BJP's CK Ramamurthy defeats Congress candidate by 16 votes
CK Ramamurthy:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. బీజేపీ చతికిలబడి.. ప్రతిపక్షానికే పరిమితమైంది. జేడీఎస్ కూడా అంతగా ప్రభావం చూపలేదు. ఎన్నికల ఫలితాల్లో ఓ బీజేపీ అభ్యర్థి కేవలం 16 ఓట్లతో విజయం సాధించారు. అవును మీరు చదువుతుంది.. అక్షరాల నిజం.
బెంగళూర్ జయనగర్ నుంచి బీజేపీ నుంచి రామమూర్తి (CK Ramamurthy) బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సౌమ్య రెడ్డి పోటీ చేశారు. సౌమ్య రెడ్డికి 57,781 ఓట్లు రాగా.. సీకే రామమూర్తికి 57,797 ఓట్లు వచ్చాయి. అంతకుముందు నాటకీయ పరిణామాలు జరిగాయి.
కౌంటింగ్ ముగిసిన తర్వాత సౌమ్య రెడ్డి (sowmya reddy) 294 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ రీ కౌంటింగ్‌కు డిమాండ్ చేయగా.. ఈసీ అధికారులు అంగీకరించారు. అలా లెక్కబెట్టగా రామమూర్తి (CK Ramamurthy) 16 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులకు అనుమానం వచ్చి.. రీ కౌంటింగ్ చేయాలని జయనగర్‌లో గల ఆర్వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కౌంటింగ్ కేంద్రం వద్ద పట్టుబట్టారు. అంగీకరించి లెక్కబెట్టగా ఓట్లలో మాత్రం తేడా రాలేదు.
రాత్రివరకు కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఇద్దరు నేతలు హోరా హోరీగా తలపడ్డారు. చివరికి అర్ధరాత్రి రామమూర్తి విజయం సాధించారని ఈసీ ప్రకటన చేసింది.
ఎన్నికల సంఘం అధికారుల తీరును డీకే శివకుమార్ (DK Shivakumar) తప్పుపట్టారు. నిజానికి ఎన్నికలో సౌమ్యరెడ్డి గెలిచారు.. కానీ ఎన్నికల అధికారులు దానిని వక్రీకరించే పని చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు కౌంటింగ్ కేంద్రం వద్దకు డీకే శివకుమార్ వచ్చారు. బయట ఆందోళనకు దిగి.. తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగం రామమూర్తికి అనుకూలంగా పనిచేసిందని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే అన్నిమార్గాల్లో బెంగళూర్ పోలీసులు, రిజర్వ్ పోలీసులను మొహరించారు.