ఎవరూ ఎవరి చేతిలోనూ మోసపోవాలని అనుకోరు. కానీ అనుకోకుండా ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. తాజాగా ఓ ఐపీఎస్(IPLS) అధికారి విషయంలో అదే జరిగింది. ఆయనను ఓ దోశ విషయంలో ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. తాను మోసపోతున్నాననే విషయం కూడా ఆయనకు తెలీకుండా జరగడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే, ఐపీఎస్ అధికారి అరుణ్ బోథ్రా ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ ఆయన దోశ(Dosha) ఆర్డర్ చేసుకొని తినేశారు. తినడం అయిపోయాక ఎవరైనా బిల్ కట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆయన కూడా అదే చేయబోయారు. కానీ ఒక్కసారిగా బిల్లు చూసి ఆయన షాకయ్యారు. తాను ఒక్క దోశ ఆర్డర్ చేస్తే, బిల్లులో రెండు దోశలకు ఛార్జ్ చేశారు. అదేంటి అని అడిగితే, వెయిటర్ చెప్పింది విని షాకయ్యాడు.
ఐపీఎస్ అధికారితో తాను వచ్చానని చెబుతూ పక్క టేబుల్ వ్యక్తి దర్జాగా దోశ లాగించి బిల్లు వచ్చే సమయానికి ఉడాయించాడని తెలుసుకోవడంతో అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా(social media)లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అలా ఎలా మోసపోయారు సర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈసారి మీతో పాటు మమ్మల్ని కూడా హోటల్‌కు తీసుకువెళితే ఇలాంటివి జరగకుండా చూస్తామని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఉచితంగా తినేసిన వ్యక్తి ఎవరో సీసీటీవీ ఫుటేజ్‌ను చూస్తే తెలిసిపోతుందని మరో యూజర్ రాసుకొచ్చారు. ఏది ఏమైనా ఆ దొంగ చాలా తెలివిగలవాడు అంటూ కొందరు కామెంట్స్(comments) చేస్తున్నారు.