Anjani Kumarపై సస్పెన్షన్ ఎత్తివేత.. మళ్లీ పోలీస్ బాస్ అయ్యేనా..?
అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణ ఓట్ల లెక్కింపు రోజు.. ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.
Anjani Kumar: తెలంగాణ మాజీ డీజీపీ, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ (Anjani Kumar) కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ (Anjani Kumar) కలిశారు. అప్పుడు అంజనీ కుమార్ డీజీపీగా ఉన్నారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం.. నిబంధనల ఉల్లంఘన కిందకి రావడంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. డీజీపీని సస్పెండ్ చేసింది. ఆ వెంటనే రవిగుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. ప్రస్తుతం ఆయన పోలీస్ బాస్‌గా ఉన్నారు.
ఆ రోజు జరిగిన విషయం గురించి ఈసీకి అంజనీ కుమార్ వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదని తెలిపారు. రేవంత్ పిలిస్తేనే వెళ్లానని, మరోసారి ఇలా జరగదని అంజనీ కుమార్ స్పష్టంచేశారు. అతని వినతిని ఈసీ పరిగణలోకి తీసుకుంది. అతనిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో మళ్లీ విధుల్లోకి రానున్నారు. తనను కలువడంతో సస్పెండ్ అయిన అంజనీపై సీఎం రేవంత్ కరుణిస్తాడో చూడాలి.. ఆయన అనుకుంటే మళ్లీ పోలీస్ బాస్‌గా నియమిస్తారు. లేదంటే రవి గుప్తా కంటిన్యూ అవుతారు.
రాష్ట్రంలో కీలక పోస్టుల్లో తనకు నచ్చిన అధికారులను నియమిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక పదవీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి కంటిన్యూ అవుతున్నారు. ఒకవేళ అంజనీకుమార్ తిరిగి డీజీపీగా వస్తే.. సీఎస్‌ను మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.