Haryana riots.. The government demolished the houses of the accused in Nuh district
Haryana riots: హర్యానాలో(Haryana)ని నూహ్ (Nuh) జిల్లాలో అల్లర్లకు కారణమైన నిందితులపై ప్రభుత్వం ఆగ్రహాం వ్యక్తం చేసింది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Law enforcement officials) జిల్లాలోని తావుడులో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను కూల్చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన వీరు ఈ అల్లర్లలో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. పక్క దేశం నుంచి వచ్చిన వారు గత నాలుగేళ్లలో జిల్లాలోని పలు స్థలాలను కబ్జాచేసి పూరి గుడిసెలు నిర్మించినట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ పేర్కొంది. అక్రమ నిర్మాణాలను తొలగించడంలో భాగంగా భారీ ఎత్తున పోలీసు బలాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
ఆందోళనలో భాగంగా రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్నారని, దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు సేకరించామని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వారు దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. నల్హార్ గ్రామంలో కూడా పోలీసులు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ గ్రామంలో భారీ సంఖ్యలో వాహనాలను దహనం చేశారు. నూహ్ అల్లర్ల వెనుక 50 మంది కుట్రదారులను పోలీసులు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా మాట్లాడుతూ.. స్థానిక శాఖల అధికారులు అక్రమ కూల్చివేతలను చేపట్టారు. వారికి భద్రత కల్పిస్తున్నాం అని పేర్కొన్నారు. ఏడీజీపీ మమతా సింగ్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న నరేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు(law and order) విఘాతం కలిగిస్తున్న అక్రమ వలసదారుల కట్టడాలను కూల్చేస్తున్నాం అని పేర్కొన్నారు. అల్లర్లు జరిగిన ఏరియాలో అమర్చిన సీసీటీవీ ఫుటేజిలను సైబర్ పోలీసుల సేకరిస్తున్నారు. ఈ అల్లర్లలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిపై 45 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
జిల్లాలోని ఓ వర్గం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన సమయంలో నుహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా (SP Varun Singla) సెలవులో ఉన్నారు. అతడి స్థానంలో ఏడీజీపీ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న నరేంద్ర బిజ్రానియాను నూహ్ ఎస్పీగా నియమించింది. నూహ్‌లో యాత్ర సమయంలో వరుణ్ సెలువులో ఉండగా పాల్వాల్ ఎస్పీ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. యాత్ర సమయంలో ఇక్కడ జరిగిన దాడులు.. ఆ తర్వాత మత విద్వేషాలుగా మారి ఇతర ప్రాంతాలకు పాకడంతో వరుణ్ సింగ్లాను భివాని ప్రాంతానికి బదిలీ చేసింది. అల్లర్లులో పాల్గొన్నవారు ఆరావళీ పర్వతాల్లో తలదాచుకొన్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్టు చేసిన ఇన్ఫ్లూయెన్సర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.