వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో ఏపీ ప్రజలను మోసం చేసిన పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని, ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర ప్రజలు సెంటిమెంటుతో కూడిన ఓటు బ్యాంకు రాజకీయాలను కోరుకోవడం లేదన్నారు. ఇప్పుడు కావాల్సింది దేశ, రాష్ట్రాల భవిష్యత్తు, అభివృద్ధి అని సూచించారు. వైసీపీకి సంబంధించిన నేతగా విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని భావిస్తే, 2024 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అజెండాతోనే తమ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పాలనుకుంటే, ఇదే విషయాన్ని జగన్ బాహాటంగా ప్రకటిస్తారా చెప్పాలని సవాల్ విసిరారు. కాబట్టి ఇలాంటి మోసపూరిత ప్రకటనలు మానుకోవాలన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, ఆ నిధులను ఉపయోగించుకోవాలన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో వినియోగించుకోలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర పథకాలకు మరో 5 శాతం లేదా 10 శాతం రాష్ట్రం కలిపి, ప్రజలకు అందించాల్సిన పథకాలను కూడా డబ్బులు ఇవ్వలేక రాష్ట్ర ప్రభుత్వం వద్దనే పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర పరిస్థితిని, మీ తీరును ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేరని, మభ్యపెట్టలేరని వైసీపీ గుర్తుంచుకోవాలన్నారు.
రాజ్యసభలో హోదాపై విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందంటూ… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, దీనిని బీజేపీ మరిచిపోయిందని విమర్శించారు. పదేళ్లు ఏపీకి హోదా ఇవ్వాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని, అందుకు కాంగ్రెస్ కూడా అంగీకరించిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకోలేదన్నారు. పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రభుత్వం అనేది కొనసాగింపు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఇప్పటికైనా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.