బీపర్జోయ్ తుఫాను కారణంగా వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అనేక చోట్ల చెట్లతోపాటు విద్యుత్ స్తంభాలు నెలకూలినట్లు వెల్లడించారు.
గుజరాత్లో గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బీపర్జోయ్ తుఫాను తీరాన్ని తాకడంతో 300కు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను కారణంగా కచ్‌తోపాటు ఇతర తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో బలమైన గాలుల కారణంగా 940 గ్రామాలలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. వందలాది చెట్లు నేలకూలాయి. సముద్రం సమీపంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఈ క్రమంలో తుఫాను కారణంగా సుమారు 22 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎవరు మరణించలేదని వెల్లడించారు. కానీ 23 జంతువులు మరణించాయని, 524 చెట్లు పడిపోయాయని చెప్పారు. గుజరాత్ కచ్‌లోని మాండ్వి పట్టణం, మోర్బిలోని మాలియాలో చెట్లు, స్తంభాలు దెబ్బతినడంతో పూర్తిగా నిన్న రాత్రి చికటిమయంగా మారినట్లు పేర్కొన్నారు. ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో మాలియా తహసీల్‌లోని 45 గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. 9 గ్రామాలలో విద్యుత్తును పునరుద్ధరిస్తున్నామని, మిగిలిన గ్రామాలలో విద్యుత్ పునరుద్ధరించబడిందని వెల్లడించారు. మరోవైపు ఐదు తహసీల్‌లలో ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు ఆయన చెప్పారు. తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి ప్రజలను షెల్టర్లకు తరలించామన్నారు. ఆ క్రమంలో 52 వేల మందిని షెల్టర్లకు తరలించగా.. 25 వేల పశువులను కూడా ఎత్తైన ప్రాంతాలకు తరలించామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అనేక వర్షాలు కురుస్తున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు పేర్కొన్నారు.