తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. అసలు గవర్నర్ పదవే పనికి రానిదంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తమిళి సై తాను గవర్నర్ పదవి చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆమె ఈ రోజు రాజ్ భవన్ లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె తన ఆవేదన చెప్పుకోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో…. సీపీఐ నారాయణ ఆమె పై విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని నారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ మీద రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ ఆరోపణలు చేయటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతోన్న గవర్నర్.. అదానీ, అంబానీలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు. గవర్నర్ పదవే పనికిమాలినదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ ముసుగులో ఉన్న బీజేపీ నేత తమిళిసైని రీకాల్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులను గవర్నర్లను చేస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు. గతంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేసిన సందర్భంలోనూ నారాయణ ఇదే స్థాయిలో స్పందించారు. రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.