ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 74వ గణతంత్ర దినోత్సవ (Republic Day) శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్ధవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం గొప్పదనం, ప్రాధాన్యం వివరిస్తూనే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లితేనే ప్రగతిపథంలో ప్రయాణిస్తామని నొక్కి చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటన ఇలా ఉంది.
‘రాజ్యాంగ బద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన రోజే పౌరులందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు స్మరించుకుంటారు. గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కతులు, సాంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వమే దేశ ప్రధాన లక్షణం, దేశంలో సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లితేనే ప్రగతిపథంలో పయనిస్తాం. పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. ఆశయాలను సాధించేందుకు మరింత కృషి చేయాలి’ అని సీఎం కేసీఆర్ తన సందేశంలో తెలిపారు.