»Centre Issues Alert As Indonesian Hacker Group Targets 12000 Indian Websites
Indonesian hacker group: 12వేల భారత వెబ్సైట్లను టార్గెట్ చేసిన ఇండోనేషియా హ్యాకర్లు
భారత ప్రభుత్వం, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పన్నెండువేల వెబ్ సైట్లను ఇండోనేషియా హ్యాకింగ్ గ్రూప్ టార్గెట్ చేసినట్లు కేంద్రం గుర్తించి, హెచ్చరికలు జారీ చేసింది.
ఇండోనేషియాకు చెందిన సైబర్ అటాక్ గ్రూప్ (Indonesian hacktivist group) భారతదేశంలోని 12,000 ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం (central government) జారీ చేసిన తన సైబర్ సెక్యూరిటీ అలర్ట్‌లో పేర్కొన్నది (cyber security alert). హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గురువారం ఈ హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నది. నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను కోరుతూ హెచ్చరికలు చేసింది.
గత ఏడాది భారీ రాన్సమ్ వేర్ దాడి (ransomware attack) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ఇతర హాస్పిటల్ సేవలతో పాటుగా దాని కేంద్రీకృత రికార్డులను యాక్సెస్ చేయలేని విధంగా చేసింది. దీంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తంమీద… 2022లో వివిధ ప్రభుత్వ సంస్థలపై 19 రాన్సమ్ వేర్ దాడులను (ransomware attack) భారత ప్రభుత్వం నమోదు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరం నమోదైన సంఖ్య కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
ఇండోనేషియా హాక్టివిస్ట్ గ్రూప్ (hacktivist group) డెనియల్ ఆఫ్ సర్వీస్ (DoS)ని ప్రారంభిస్తోందని, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ (DDoS) దాడుల ద్వారా వెబ్ సైట్లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. DDoS దాడులు అనేక వ్యక్తిగత కంప్యూటర్ల నుండి ఏకకాలంలో పంపబడిన డేటాతో దాడులకు పాల్పడటం ద్వారా కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ఉద్దేశపూర్వకంగా స్తంభింపచేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. హ్యాకర్లు టార్గెట్ చేసుకున్న కొన్ని వెబ్ సైట్లను కేంద్రం గుర్తించింది. ఆ సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక ఇంజనీరింగ్ దాడులకు గురికాకుండా చూసుకోవాలని, గుర్తు తెలియని ఈ-మెయిల్లు లేదా లింక్‌లపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. వాటి పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ల భద్రతకు ముప్పు వాటిల్లవచ్చునని తెలిపింది. అన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లు తాజాగా ఉన్నాయా నిర్ధారించుకోవాలని సూచించింది.