గత కొన్ని రోజుల నుంచి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు తమ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా తమ సంస్థలోని ఉద్యోగుల్ని భారీగా తొలగించింది. ఇప్పటి వరకూ ఈ సంస్థ చాలా మందిని రిక్రూట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.
ఇంజనీరింగ్ రోల్స్ కు సంబంధించి దాదాపుగా 15 శాతం ఉద్యోగుల్ని బైజూస్ సంస్థ తొలగించినట్లు వెల్లడించింది. మొత్తంగా 1500 మంది ఉద్యోగుల్ని తమ సంస్థ తీసేసినట్లు తెలిపింది. ఇందులో సీనియర్ ఉద్యోగులే కాకుండా ఇటీవలె కొత్తగా ఎంపికైనవారు కూడా ఉన్నారు. ఉద్యోగాల తొలగింపు వల్ల ఏర్పడే ఖాళీని భర్తీ చేసేందుకు కూడా కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థలోని అనేక కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది.