గణేష్ చుతర్థి వచ్చిందంటే చాలు.. ఏ ప్లేస్ లో ఎంత పెద్ద వినాయకుని విగ్రహం పెడుతున్నారు అనే విషయంలో అందరూ ఎంత ఆసక్తి చూపిస్తారో… నిమజ్జనానికి ముందు వినాయకుని లడ్డూ ఎంత ధర వేలంలో ఎంత పలుకుతుంది అనే విషయంపై కూడా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అందరూ బాలాపూర్ లడ్డూ పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ భారీ ధర పలుకుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా లడ్డూ వేలం పాట నిర్వహించగా.. రికార్డు ధర పలకడం గమనార్హం.
పొంగులేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి వేలాన్ని రూ.1,11,116ల నుంచి నిర్వాహకులు వేలంపాట ప్రారంభించగా అనేక మంది పోటీపడ్డారు. గతేడాది కంటే రూ.5.70లక్షల ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం.
తేడాది కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో కలసి నాదర్గుల్ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. 2019లో కొలను రాంరెడ్డి 17.60లక్షలకు బాలాపూర్ గణేశుడి లడ్డూను దక్కించుకోగా 2020లో కరోనా కారణంగా వేలంపాట నిర్వహించలేదు. 2021లో లడ్డూను దక్కించుకున్న శశాంక్ రెడ్డి 2019లో కంటే రూ.1.30లక్షల ఎక్కువగా రూ.18.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాటలో లడ్డూను స్థానికులు దక్కించుకుంటే డబ్బు మరుసటి ఏడాది చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ఏడాది రూ.450తో మొదలైన లడ్డూ వేలంపాట నేడు రూ.లక్షల్లో పలుకుతుండటం విశేషం. బాలాపూర్ లడ్డూ దక్కించుకుంటే గణేశుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఎన్ని లక్షల రూపాయలు పెట్టైనా లడ్డూను దక్కించుకునేందుకు వెనుకాడరు.