»Alert To The Devotees Going To Tirumala On One Side A Leopard On The Other Side A Bear
Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్..ఓ వైపు చిరుత..మరోవైపు ఎలుగుబంటి!
తిరుమల నడకమార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తరుణంలో భక్తులు గుంపులుగా రావాలని సూచించారు. నడకమార్గంలో గట్టి నిఘా ఉంచారు.
తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులను టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. నడకదారిలో ఆగస్టు నెలలో లక్షిత అనే బాలికను చిరుత లాక్కెళ్లిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో లక్షితను చిరుత పొట్టనబెట్టుకుంది. అంతకుముందు కూడా అదే దారిలో కౌశిక్ అనే బాలుడ్ని కూడా చిరుత అడవిలోకి లాక్కెళ్లింది. అయితే అక్కడున్న సిబ్బంది స్పందించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బతికాడు.
ఆ రెండు ఘటనల తర్వాత టీటీడీ అధికారులు నడకదారుల్లో గట్టి నిఘాను ఉంచారు. భక్తులు భయాందోళన చెందకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటవీ సిబ్బంది సాయంతో టీటీడీ అధికారులు నడకదారి వెంబడి సంచరించే కొన్ని చిరుతలను కూడా బంధించి వాటిని వేరే చోటుకు తరలించారు. నడకదారులకు సమీపంలో చాలా చోట్ల ట్రాప్ కెమెరాలను అమర్చి వన్యమృగాల సంచారంపై ప్రత్యేక నిఘాను ఉంచారు.
అయితే తాజాగా తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు రికార్డు అయ్యింది. ఈ తరుణంలో తిరుమలకు వెళ్లే భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేశారు. నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులుగా రావాలని సూచించారు.