తెలంగాణలోని ములుగు జిల్లాలో గురువారం నాటి వరదల కారణంగా తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపన్నవాగు వాగు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతులంతా పొరుగున ఉన్న ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందినవారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, మరొకరు కొండాయి సర్పంచ్ సమీప బంధువైన సమ్మక్కగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారు తమకు సాయం చేసే వారని లేరని వాపోతున్నారు.
మరోవైపు వాగులో కొట్టుకుపోయిన అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తుల జాడ తెలియాల్సి ఉంది. గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మల నివాసమైన మేడారం సమీపంలోని జంపన్నవాగులో వారి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం అదే జిల్లాలోని వెంకటాపూర్ మండలం బూరుగుపేట గ్రామంలో ట్యాంక్ తెగిపోవడంతో ఓ వ్యక్తి, అతని భార్య, తల్లి వరద నీటిలో కొట్టుకుపోయారు.