KRNL: ఆదోనిలో ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారధి సమక్షంలో ఇవాళ వైసీపీ నుంచి 30 కుటుంబాలు బిజెపిలో చేరాయి. హనవాలు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరికయ్యారు. బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
VZM: జిల్లాలో డీజిల్ సరఫరాకు సంబంధించి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ సరఫరాపై వీసీలో సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
NDL: సంజామల మండలం మంగపల్లెలో నిర్వహించిన 67వ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని నిర్వాహకుడు పి.మౌలాలి రెడ్డి ఆదివారం తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి నెల శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిపుణ వైద్యులు వివిధ వ్యాధులకు పరీక్షలు చేసి సుమారు 1,000 మందికి ఉచిత మందులు అందించారు. భోజన వసతి కూడా కల్పించారు.
W.G: జిల్లాలో పరిశ్రమల స్థాపన ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా “ఇండస్ట్రియల్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయబడిందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మధ్యవర్తుల వద్దకు వెళ్లి అనవసరమైన కాలయాపన, ఖర్చులు చేయవద్దని సూచించారు.
KRNL: ఆదోని మండలం కపటి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇవాళ ఎమ్మెల్యే డా. పార్థసారధికి బీజేపీ ఆదోని మండల నాయకులు వినతి పత్రం అందించారు. బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల కోసం డిమాండ్ చేశారు. స్మశానవాటికల అభివృద్ధి కూడా చేపట్టాలని కోరారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
NTR: ఏపీఎల్ సీజన్-5 వేలంలో ఉత్కంఠభరిత వాతావరణం మధ్య ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడ సన్‌రైజర్స్ జట్టులోకి పండురంగ రాజు పెన్మత్స అధికారికంగా ఎంపికయ్యాడు. రూ.9.50 లక్షలకు ఆయనను జట్టు దక్కించుకోవడం విశేషం. ప్రతిభావంతుడైన ఆటగాడిని జట్టులోకి ఆహ్వానించడం పట్ల ఫ్రాంచైజీ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.
NTR: ఇబ్రహింపట్నంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభు కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. వీరులపాడు నుంచి బైక్ పై ఇంటికి వస్తుండగా వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిండంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను 108లో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
SKLM: పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మండలంలోని బసవసాయి, భోగాబంద, హంసరాలి గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశమై స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ క్రమశిక్షణతో కష్టపడాలని, ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
NDL: మహానంది క్షేత్రంలో సెలవు రోజు కావడంతో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. భక్తులు స్థానిక కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
KDP: ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని నాగ నాదేశ్వర కోన వద్ద బ్రహ్మంగారి ఆలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఈ పూజలు చేపట్టారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
KDP: మైదుకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతా జయంతి సందర్భంగా అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి పూజ చేశారు. ఈ ప్రత్యేక పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, కలశ పూజలు చేపట్టారు. ఆర్యవైశ్య ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ELR: కొణిజర్లకు చెందిన యువత, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించినందుకు గాను ఆయనను ఘనంగా సత్కరించారు. రూ. 3.75 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణంతో పాటు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు చేపట్టారన్నారు.
W.G: రేపు సోమవారం జిల్లా కలెక్టరేట్ తో పాటు డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఆదివారం ఆమె భీమవరంలో వివరాలు తెలిపారు.అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
సత్యసాయి: జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అర్జీదారులు నేరుగా రావడమే కాకుండా “meekosam.ap.gov.in” వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
కోనసీమ: దేశ జనగణన-2027 డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమై 30 వరకు జరిగే స్వీయ జనగణనపై ప్రజల్ని చైతన్య పరిచేందుకు సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి అమలాపురం గడియార స్తంభం నుంచి కలెక్టరేట్ వరకు జనగణన, 5కె రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు.