SKLM: పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మండలంలోని బసవసాయి, భోగాబంద, హంసరాలి గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశమై స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ క్రమశిక్షణతో కష్టపడాలని, ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
NDL: మహానంది క్షేత్రంలో సెలవు రోజు కావడంతో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. భక్తులు స్థానిక కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
KDP: ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని నాగ నాదేశ్వర కోన వద్ద బ్రహ్మంగారి ఆలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఈ పూజలు చేపట్టారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
KDP: మైదుకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతా జయంతి సందర్భంగా అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి పూజ చేశారు. ఈ ప్రత్యేక పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, కలశ పూజలు చేపట్టారు. ఆర్యవైశ్య ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ELR: కొణిజర్లకు చెందిన యువత, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించినందుకు గాను ఆయనను ఘనంగా సత్కరించారు. రూ. 3.75 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణంతో పాటు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు చేపట్టారన్నారు.
W.G: రేపు సోమవారం జిల్లా కలెక్టరేట్ తో పాటు డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఆదివారం ఆమె భీమవరంలో వివరాలు తెలిపారు.అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
సత్యసాయి: జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అర్జీదారులు నేరుగా రావడమే కాకుండా “meekosam.ap.gov.in” వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
కోనసీమ: దేశ జనగణన-2027 డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమై 30 వరకు జరిగే స్వీయ జనగణనపై ప్రజల్ని చైతన్య పరిచేందుకు సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి అమలాపురం గడియార స్తంభం నుంచి కలెక్టరేట్ వరకు జనగణన, 5కె రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు.
KRNL: ఆలూరు నియోజకవర్గం హోళగుందలో 15 రోజులుగా తాగునీరు రాక మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడి చేసి బైఠాయించారు. ఉప్పు నీరు వదులుతున్నారని, రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బందులు పడుతున్నామని ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం లేకపోతే కార్యాలయానికి తాళం వేస్తామని మహిళలు హెచ్చరించారు.
GNTR: పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అవసరమైన నూతన విద్యుత్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులతో రూ.85 లక్షల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.
TPT: శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 45 ఏళ్ల వయస్సు గల మహిళ అనారోగ్యంతో మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతురాలి ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. మృతురాలు పాచి కలర్ చుడీదార్ ధరించి ఉంది. ఎవరైనా గుర్తిస్తే టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని లేదా ఈ 9440900008 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
VZM: జిల్లాలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 8,059 చెరువుల పరిధిలో వేలాది పనులు చేపట్టి పూడికతీత, కాలువల శుభ్రపరచడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేస్తున్నారు. ఈ పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు సుమారు 2.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అధికారులు సమన్వయంతో పనులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రకాశం: బేస్తవారిపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఇవాళ అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు కోరుకున్నారు.
PLD: వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా స్పందించారు. వెంకుపాలెం పరిసరాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సహజ వనరుల పరిరక్షణలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
KDP: చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కడప గ్రామంలో శనివారం రాత్రి దాడి ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ తన అనుచరులతో కలిసి ఓబులేశ్ పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ఓబులేశ్ తలకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.