KDP: బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు కలసపాడు టౌన్లో అధికారు శనివారం దాడులు చేశారు. డి.కృష్ణారెడ్డి దుకాణంలో 4 లీటర్లు, దూదేకుల దస్తగిరిమ్మ దుకాణంలో 7 లీటర్లు, జక్క సుధాకర్ దుకాణంలో 5 లీటర్లు కలిపి మొత్తం 16 లీటర్ల పెట్రోలు సీజ్ చేశారు. అక్రమంగా పెట్రోల్ నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
KDP: బద్వేల్ నేషనల్ హైవే-67 బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం రోడ్డుపై ఉన్న పశువులను ఢీకొనడంతో 4 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. అనంతరం రోడ్డుపై ఉన్న పశువులను గమనించలేక బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. బద్వేల్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ELR: బుట్టాయిగూడెం(m)వీరన్నపాలెం గ్రామంలో 15 ఏళ్ల మంచినీటి సమస్యను పరిష్కరిస్తూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నూతన ట్యాంకులను ప్రారంభించారు. ప్రజల విన్నపంపై స్పందించి కేవలం వారం రోజుల్లోనే తాగునీటి సౌకర్యం కల్పించామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
GNTR: ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రహదారి భద్రత, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు జరిగాయి. జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై ప్రమాదాల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
W.G: భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యావరణ పరిరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్వా వ్యర్థ జలాలను నిబంధనలకు విరుద్ధంగా కాలువల్లో వదిలే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
KDP: సిద్ధవటం(M)మాచుపల్లి పెన్నానదిలో JCB యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడంపై స్థానిక రైతులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లోకి తోలుకోవాలని రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొంది,ఆ ఇసుకను కడపకు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి,బోర్లలో నీరు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
అన్నమయ్య: మదనపల్లె మండలం ఆవలపల్లిలో శనివారం సాయంత్రం వ్యవసాయ అప్పులు తీరక మనస్తాపానికి గురైన వెంకటేష్ అనే యువ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
NDL: బనగానపల్లె మండలం పసుపులలో రూ.85.20 లక్షల అభివృద్ధి పనులను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు, పార్టీ నేతలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులతో పాటు జల్ జీవన్ మిషన్ కింద రూ.50 లక్షలతో నిర్మించిన 60 కెఎల్ ఓవర్ హెడ్ ట్యాంక్‌ను బీసీ ప్రారంభించారు.
KRNL: కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.చిరంజీవి, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డి.మహదేవరావు పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. విధి నిర్వహణలో వారు చూపిన నిబద్ధతను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
CTR: రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ చేపట్టిన గజ గణన ముగిసింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మూడు రోజులపాటు ఏనుగుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గణన చేపట్టారు. మొదటి రెండు రోజులు ఏనుగుల పాదముద్రలు, వెంట్రుకలు, పేడ సేకరించారు. మూడోరోజు ఏనుగులు ఎక్కువగా నీటి కోసం వచ్చే గుంటల వద్ద పర్యవేక్షించారు. ఈ డేటాను అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి పంపనున్నారు.
ATP: అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసరావు పదవీ విరమణ వీడ్కోలు సమావేశం పోలీస్ కన్వెన్షన్ హాలులో ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆయన్ను దుశ్శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. శ్రీనివాసరావు సేవలను ఎస్పీ కొనియాడారు. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు 1989లో ఎస్సైగా ప్రస్థానం ప్రారంభించి సీఐ, డీఎస్పీ, ఏఎస్పీగా పదోన్నతులు పొందారు.
ATP: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో APSPDCL అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ పర్యవేక్షణకు జిల్లాకు ఒక చీఫ్ జనరల్ మేనేజర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. స్తంభాలు, లైన్లు దెబ్బతింటే టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800425155333 లేదా నంబర్ 9133331912లో సంప్రదించాలని కోరారు.
E.G: ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం రాజమండ్రిలో జిల్లా పోలీసు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డిజిటల్ డాక్యుమెంటేషన్‌పై దిశానిర్దేశం చేశారు. న్యాయస్థానాల్లో సమన్లు, వారెంట్ల అమలులో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమన్నారు.
BPT: చీరాల మండలంలోని దేశాయిపేటలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి పొంగళ్ల కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
కోనసీమ: మండపేట మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ద్వారపూడి గ్రామంలో మాజీ జెడ్పిటీసీ తులా రంగారావు, అనమాల రాము, ఆకుమర్తి సుబ్బారావు, అర్తమూరు గ్రామంలో మండా వెంకటరెడ్డి, సబ్బెళ్ళ రామారెడ్డి, ఏలేటి గణపతి, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.