VSP: జీవీఎంసీ 78వ వార్డు ఉక్కునగరంలో ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకూ ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని నిర్వహించనున్నట్టు వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్, ఫోటో మార్పిడి వంటివి చేపడుతున్నట్లు తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని వార్డు సచివాలయంలో జరిగే సేవలను వినియోగించుకోవాలన్నారు.
W.G: తాడేపల్లిగూడెం (M) వెంకట రామన్నగూడెంలో సోమవారం సాయంత్రం దయ్యాల సూర్యనారాయణను అదే గ్రామానికి చెందిన కిషోర్ కిటికీ అద్దంతో మణికట్టుపై కోసి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులో పనిచేస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
అనంతపురంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు. హైదరాబాద్‌లోని ఏఎల్ఈఏపీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్ రమాదేవిని ఆయన కలిశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కు అందుబాటులో ఉందని, కొత్తగా పరిశ్రమలు స్థాపించే మహిళలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు.
KRNL: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సోమవారం అత్యధికంగా కర్నూలులో 43, నంద్యాల, కడప, విజయవాడ, గుంటూరులలో 42 డిగ్రీల వేడి నమోదైంది. అనంతపురం, గోదావరి జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
NDL: శ్రీశైలం పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇనుప గేటును కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం దర్శనానికి హైదరాబాద్ నుంచి 9 మంది భక్తులు వెళ్లారు. కాగా, కుక్కను తప్పించబోయి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
తిరుపతి నగరంలో ఈట్ స్ట్రీట్‌లో దుకాణాలు పొందిన వ్యాపారులు ఈ నెల 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. సోమవారం తాళాలు అందజేసి నిబంధనలు వివరించారు. కేటాయించిన ఆహార పదార్థాలనే విక్రయించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం గంట్యాడ మండలం రామవరం గ్రామంలో గజపతినగరం నియోజకవర్గంలోని VAO లకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ ఫోన్లు ప్రభుత్వం అందించడం వలన పొదుపు సంఘాలకు మెరుగైన సేవలు అందుతాయని, ప్రజలకు, పొదుపు సంఘాలకు పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
KRNL: కూడేరు వద్ద ఆదోనికి చెందిన కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప గొర్రెల కాపరులతో ఇవాళ సమావేశమయ్యారు. ఎండాకాలంలో మేత, నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కాపరులు వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని సీఎంకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. దళారుల దోపిడీ, మృగాల బెడదపై కూడా స్పందించి ప్రభుత్వం సబ్సిడీ పథకాలు అందిస్తోందన్నారు.
PLD: రాజుపాలెం మండలం కొండమోడులోని దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనాధాశ్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు నరసింహారావు, మస్తాన్‌రావు, గంగాధర్ పాల్గొన్నారు.
ASR: చింతపల్లి గ్రామ దేవత ముత్యాలమ్మ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. రేపటి నుంచి 17 వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చైన్‌స్నాచింగ్, బైక్ రేసింగ్, మద్యం అల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
VZM: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 50 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, 7 దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సత్యసాయి: కదిరి పట్టణంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
NLR: రేపు ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరవుతారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,12,595 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 198 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 12 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2084 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.