KRNL: నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ హెచ్చరించారు. బంగారుపేట పరిధిలో దాడులు నిర్వహించినట్లు నాటుసారా నిర్మూలనలో భాగంగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి, నిఘా పెంచినట్లు తెలిపారు. ప్రజలకు దాని వల్ల కలిగే హానిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు తెలియజేయాలని కోరారు.
VZM: రాజాం CI అశోక్ కుమార్ మంగళవారం స్దానిక మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినట్లయితే కౌన్సిలింగ్ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల సంచారం గమనించి వారి వివరాలు సేకరించాలన్నారు
SS: లేపాక్షి మండల ఉపాధి హామీ అదనపు కార్యక్రమాధికారి (ఏపీవో) చంద్రశేఖర్‌కు డ్వామా ఏపీడీ శివానందనాయక్ నోటీసులు జారీ చేశారు. కూలీలకు పనులు కల్పించడం, ఎన్ఎంఎంఎస్ యాప్‌లో హాజరు నమోదు చేయడంలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. మండలంలో 1937 మందికి పనులు కల్పించాల్సి ఉండగా, కేవలం 180 మందికే కల్పించినట్లు అధికారులు గుర్తించారు.
ELR: ద్వారకాతిరుమల నకిలీ టికెట్ల కేసులో అసలు దోషులను తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈవో వద్ద పనిచేసిన ఓ వ్యక్తిని కాపాడేందుకు ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అయితే, SP ప్రతాప్ శివ కిషోర్ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
SS: సోమందేపల్లి మండలం రంగేపల్లిలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప సమక్షంలో మంగళవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్థులకు సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రొజెక్టర్ ద్వారా సమాచార వీడియోలను ప్రదర్శించారు. ప్రజల్లో చట్టాలు, భద్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం అని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు.
ATP: యల్లనూరు మండలంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ చంద్రశేఖర్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలోని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు రూ.150 ప్రభుత్వ రుసుం చెల్లిస్తే చాలన్నారు.
KDP: కమలాపురం మండలం పెద్దచెప్పలిలో ఈనెల 18న ఎల్లమ్మ తిరుణాల మహోత్సవ సందర్భంగా ఎద్దులచే బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. పోటీలో మొదటి విజేతకు రూ.1,20,000, లతో పాటు ఎలక్ట్రికల్ స్కూటర్, 2వ బహుమతి రూ. లక్ష, 3వ బహుమతి రూ. 80,000, 4వ బహుమతి రూ.60,000, ఇలా వరుసగా 11 బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
KRNL: కర్నూలు మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల 10న జూనియర్ మహిళల హాకీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ హాకీ కోర్ కమిటీ సభ్యులు దాసరి సుధీర్ తెలిపారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభకనబరిచిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
ASR: పాడేరు మండలం తలారిసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజతో కలిసి కలెక్టర్ టీ.నిశాంతి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా బోధనను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో వివిధ తరగతి గదులను సందర్శించారు. వారికి అందుతున్న విద్యా బోధనపై ఆరా తీశారు.
W.G: కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు విమర్శించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
TPT: వేసవి దృష్ట్యా హీట్ వేవ్స్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత లేకుండా బోర్లు, చేతి పంపులను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వడదెబ్బ నివారణకు వైద్య శాఖ సిద్ధంగా ఉండాలని, ORS అందుబాటులో ఉంచాలని సూచించారు. జనాభా లెక్కలు, పీ-3 కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.
VZM: గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మత్తు పదార్దాలు వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని పేర్కొన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కుటుంబ విభేదాల నేపథ్యంలో భార్య వెంకటలక్ష్మమ్మ (60)ను భర్త వెంగన్న హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ELR: జిల్లా కేంద్రంలోని జ్యూట్ మిల్ ఫ్లై ఓవర్ పై నుండి పాసింజర్ ఆటో మంగళవారం రాత్రి అదుపుతప్పి కింద పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ ను వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
NTR: తిరువూరు పట్టణంలో జరుగుతున్న పరిశుభ్రత పనులను మున్సిపల్ కమిషనర్ కె.మనోజ బుధవారం ఉదయం పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ చెత్తను సమయానికి తరలించాలని, వీధులు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.