KDP: కొండాపురంలో ఓ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
W.G: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, అక్కడ భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సత్యసాయి: పరిగి ఎస్సై రవికుమార్ తిరుమల దేవరపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన చట్టాలు, డ్రగ్స్ నివారణ, మహిళా భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలకు వివరించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
SKLM: హెల్మెట్ ధరించడం భారం కాదు, ప్రతి వాహనదారుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం “అభయం” పేరిట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని అన్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు ఉన్నారు.
విశాఖ: గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతులకు మెరుగైన పరిహారం అందించామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌తో కలిసి శనివారం ఆయన తర్లువాడ రైతులతో సమావేశమయ్యారు. ఎకరాకు 20 సెంట్ల భూమితో పాటు ఇతర హామీలను నెరవేరుస్తామన్నారు. అనంతరం రెండు రోజుల్లో జరగనున్న శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
VZM: ఎల్.కోటలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న MLC ఇందుకూరి రఘురాజు అదికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎస్.కోటలో టెండర్లు పిలిచి ఎల్.కోటలో ఎందుకు పిలవలేదని వారిని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై ఇంజినీరింగ్ శాఖాధికారులను నిలదీశారు. మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల విషయంలో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు.
NDL: సింగపూర్‌లో రాష్ట్ర మంత్రుల పర్యటన కొనసాగుతోంది. ఐదో రోజు శనివారం సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రుల బృందం అధ్యయనం చేస్తోంది. విపత్తు వేళల్లో ప్రభుత్వం ఏ విధంగా పని చేస్తుందో SUSS అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా వివరించారు. సంక్షోభంలో నైతిక నిర్ణయాల ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చించారు. మంత్రుల బృందంలో బీసీ, అచ్చెన్న, అనిత, సత్యకుమార్ ఉన్నారు.
విశాఖ: కేజీహెచ్‌లో రూ. 3 కోట్లతో ఏర్పాటు చేసిన సికిల్ సెల్ ఎనిమియా, హీమోగ్లోబినోపతీస్ ప్రయోగశాలను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం. నాయక్ సందర్శించారు. ల్యాబ్ పనితీరును పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపించే సికిల్ సెల్, తలసీమియా వంటి వ్యాధులను గుర్తించే అవకాశం ఉందన్నారు.
ప్రకాశం: కొరిసిపాడు మండలం బొడ్డువానిపాలెం హైవేపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే 108లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: కలెక్టరేట్లోని మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆహార ఉత్పత్తుల తయారీ ద్వారా స్వయం ఉపాధి సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్న తీరు ప్రశంసనీయమని శనివారం జిల్లా కలెక్టర్ డా.సిరి అన్నారు. మహిళలు స్వయంగా వ్యాపారాలు ప్రారంభించి కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
E.G: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను (26) సెంట్రల్ జోన్ శక్తి టీం గుర్తించి మాట్లాడగా, కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలిపింది. వెంటనే స్పందించిన శక్తి టీం ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.
GNTR: కొల్లిపరలో వాసవీమాత జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించనున్నట్టు సంఘ అధ్యక్షుడు అన్నవరపు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్నని భక్తులు గమనించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.
ATP: అనంతపురం లలితకళా పరిషత్‌లో నేడు నిర్వహించనున్న “బీసీ గళం” సభ పనులను వైసీపీ నేతలు పరిశీలించారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. బీసీల హక్కుల కోసం జరిగే ఈ పోరాట సభకు ప్రజలు, మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.
NLR: నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శనివారం రాత్రి కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్‌ను సీఐ గిరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోటల్ రికార్డ్‌ను పరిశీలించారు. అనంతరం ప్రతి రూమును క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేరని ఆరా తీశారు. మద్యం సేవిస్తున్న ఏడుగురుని స్టేషన్‌కు తరలించారు.