KKD: కాకినాడ నగరంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. సోమవారం నగరంలోని గుడారిగుంట ప్రాంతంలోని లక్ష్మీనగర్, ఆర్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా కమిషనర్ సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.
ATP: ఉరవకొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించనున్నారని ఏఎస్ డబ్ల్యూవో రామ్మోహన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు. అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
KRNL: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సోమవారం భేటీ అయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను లోకేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు.
ప్రకాశం: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 74 అర్జీలు వచ్చాయి. ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎస్పీ అర్జీలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకోసం కార్యక్రమం జరిగింది.
PLD: రాజుపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్’ పథకాన్ని సోమవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు.
BPT: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనగల్లు గ్రామంలో జూదం జరుగుతోందన్న సమాచారం మేరకు ఎస్సై తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,930 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KRNL: ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీక్షించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధిపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆసక్తిగా వీక్షించారు. మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోందన్నారు.
VSP: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డా. కేఎన్ఆర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, కన్వీనర్ పొలిమేర శ్రీనివాస్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి వినతులు స్వీకరించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
AKP: టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు తెలిపారు. ఇవాళ కే కోటపాడు మండలం గొట్లం, శృంగవరంలో పర్యటించి కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పూర్తితో ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: జరుగుమల్లికి చెందిన వైసీపీ నాయకుడు కొండూరి హర్షవర్ధన్ రెడ్డికి కీలక పదవి దక్కింది. ఆయన YCP స్టేట్ వాలంటరీ వింగ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం జరుగుమల్లి వైసీపీ మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసరావుతో పలువురు నాయకులు ఆదిమూలపు సురేశ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ATP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, కర్మాగారాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలు పాటించాలని కోరారు.
PPM: జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ SV మాధవ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఫిర్యాదులను SP క్షుణ్ణంగా పరిశీలించారు.
కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం పరిధిలో నడిపూడి నుంచి వచ్చే పంపింగ్ మెయిన్ నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 14 సాయంత్రం, ఏప్రిల్ 15 ఉదయం మంచినీటి సరఫరా నిలుపుదల చేయబడుతుందని మునిసిపల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలు ముందుగా నీటిని నిల్వ చేసుకోవాలని కోరారు.
కృష్ణా: పామర్రు, గుడివాడ నియోజకవర్గాల ముదినేపల్లి మండలం మీదుగా రూ.7.72 కోట్లతో ప్రవహించే కొమరోలు మేజర్ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
E.G: అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ధవలేశ్వరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తక్షణం అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10,000 స్టైఫండ్, 55 ఏళ్లు నిండిన న్యాయవాదులకు రూ.15,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.