SKLM: జిల్లా కేంద్రంలోని కొన్న వీధిలో జరుగుతున్న నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం రాత్రి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
PPM: ఈనెల 23న శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. వేడుకలకు జిల్లాస్థాయి అధికారులు, పాల్గొంటారని చెప్పారు.
కోనసీమ: మురమళ్లలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకకు MLA దాట్ల సుబ్బరాజు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు స్వామి వారు చంద్ర ప్రభ వాహనంపై గ్రామోత్సవంలో ఊరేగారు. ఎదురు సన్నాహం, ద్వాదశ ప్రదక్షిణల అనంతరం వేద మంత్రాల మధ్య కళ్యాణ మహోత్సవం జరిపారు.
ASR: జిల్లాలో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 26 వరకు స్వల్ప వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. 0.2 నుంచి 2.1 మి.మీ వరకు వర్షపాతం ఉండొచ్చని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీల మధ్య కొనసాగనున్నాయి. రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సత్యసాయి: వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. మక్బూల్తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
SKLM: అన్న క్యాంటీన్ల నిర్వహణలో నాణ్యత పెంచాలి అని అన్న క్యాంటీన్ల సీఈవో పోతుల వంశీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్న క్యాంటీన్ల అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్న క్యాంటీన్ల పనితీరు, భోజన నాణ్యత పై నిరంతరం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
పల్నాడు: జిల్లాలో అనుమానాస్పదంగా దాచిన పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో కృష్ణాలయం దగ్గర ఓ ఇంటి మరుగుదొడ్డిలో ప్లాస్టిక్ డబ్బాలో ఐదు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. DSP హనుమంతరావు ఆధ్వర్యంలో క్లూస్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడికి ఇవి ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.
VSP: జిల్లా వైసీపీ కార్యాలయంలో అధ్యక్షుడు కె.కె. రాజు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు మరియు సచివాలయ స్థాయిల్లో పటిష్టం చేయాలని, ఇందుకోసం సమగ్రమైన కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభ్యుల వివరాలను డిజిటల్ డేటాబేస్లో నమోదు చేసి, నిర్ణీత గడువులోగా కార్యాలయానికి సమర్పించాలన్నారు.
KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్నటి పత్తి ధరలు రైతులకు నిరాశ కలిగిస్తున్నాయి. మార్కెట్లో నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.7,350 నుంచి రూ.9,011 వరకు మాత్రమే ధర లభిస్తోంది. గతంతో పోలిస్తే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు పెరిగినా, దిగుబడికి తగిన ధర రాకపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.
VZM: జలధార – జలహారతిలో భాగంగా ప్రతి గ్రామంలో గుర్తించిన చెరువుకు జియో టాగింగ్ చేయాలనీ కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఉన్న చెరువులకు, పుష్కరిణిలకు జియో టాగింగ్ చేయాలని జరగాలన్నారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, జలధార, జలహరితపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
AKP: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు అన్నారు. మాడుగుల మండలం డి.గొటివాడ, తాటిపర్తి గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలతో మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ప్రకాశం: లింగసముద్రం పంచాయతీలోని వాకమల్లవారిపాలెం-జంపాలవారిపాలెం SC కాలనీ మధ్య బొడ్డురాయి వివాదం పరిష్కారమైంది. సమస్యపై పలు దఫాలుగా చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరక వాయిదా పడింది. మంగళవారం MRO హనుమాయమ్మ, CI నరేశ్, SI రాంబాబు ఆధ్వర్యంలో ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. సిద్ధాంతి సూచనలతో రెండు వర్గాల అనుమానాలు నివృత్తి కావడంతో ఇరు పక్షాలు అంగీకరించాయి.
ASR: పాడేరు మోదకొండమ్మ అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీ.నిశాంతి తెలిపారు. నిన్న కలెక్టరేట్లో ఉత్సవ ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో, రాష్ట్ర స్థాయి వేడుకలకు అనుగుణంగా పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను, కమిటీ సభ్యులను ఆదేశించారు. పండుగ నిర్వహణకు కలెక్టర్ రూ.50వేలు అందజేశారు.
కోనసీమ: రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూ రీసర్వే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలో గ్రామసభలు నిర్వహించి, అర్హులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా SP ధీరజ్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో చెకింగ్ చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. సరిగా పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.