NDL: సిరివెళ్ల PHC మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించినట్లు డాక్టర్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా వాటిని అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథా అని పేర్కొన్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటువ్యాధులు దరి చేరవని స్పష్టం చేశారు.
సత్యసాయి: కదిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
CTR: గుడిపాల మండలం దాయంవారి పల్లెలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చల్లా గురుస్వామి నాయుడు ఇవాళ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జీజేఎం ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీవీర్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 7వ తరగతికి ఒక సీటు (బాలిక), 8, 9వ తరగతులకు ఒక్కో సీటు (బాలురు) ఎస్టీ విద్యార్థుల నుంచి కోరుతున్నామన్నారు. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు స్వీకరిస్తున్నామన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయాల స్థితిగతులు, బకాయిల పరిష్కారం కోసం ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను మంగళవారం కలిశారు. గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ భవనాల్లో ఉన్న గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు, డిజిటల్ సదుపాయాలు కల్పించాలని కోరారు.
NDL: బండి ఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరు, పార్నపల్లె, బండి ఆత్మకూరు పశు వైద్యశాలలను వెలుగోడు సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. పశువైద్యశాలలో రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. గాలికుంటు వ్యాధి టీకాల ప్రగతిని సమీక్షించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. వారితో పాటు మండల పశు వైద్యులు పాల్గొన్నారు.
VZM: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్‌ను తగ్గించే జీవో 60ను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం అధ్యక్షులు మంత్రి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అధిక పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఈ విధమైన జీవో తమకు తీవ్ర నిరాశను కలిగిస్తుందన్నారు.
AKP: ఎలమంచిలి పట్టణం అన్న క్యాంటీన్‌ను మంగళవారం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా భోజన సౌకర్యంపై ఆరా తీశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో మరో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐదు రూపాయలకే పేద ప్రజలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
KRNL: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ అమరావతికి పూర్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఊపిరి అన్నారు.
ATP: హైదరాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న డబ్లింగ్ పనుల వల్ల గుంతకల్లు నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి 19 వరకు గుంతకల్లు – బోధన్ (57411), కాచిగూడ – గుంతకల్లు (57412) రైళ్లు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామానగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. క్లబ్ రోడ్డులో పేరుబోయిన రాంబాబుకు చెందిన ఐదు ఎకరాల గడ్డివాము అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో రైతుకు రూ.75వేలు నష్టం జరిగింది.
NTR: నందిగామ మండలం చందాపురంలో రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వేలో వచ్చిన తప్పులను సరిదిద్ది, రాజముద్రతో కూడిన నాణ్యమైన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ భూమి సమస్యలు తీరినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
BPT: చీరాల సముద్రతీరంలో అక్రమంగా సాగుతున్న నిర్మాణాల వల్ల మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని, బీచ్ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చీరాల తీరంలో లాడ్జీలు, బాపట్ల బీచ్ పరిసరాల్లో రిసార్టులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు వద్ద అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన నలుగురు యువకులలో ఒకరైన సత్తెనపల్లి పట్టణానికి చెందిన గిరీష్(19) తీవ్ర నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మంగళవారం అతని మృతదేహం కనుగొనబడింది. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
WG: మొగల్తూరు మండలం శేరేపాలెంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. MLA బొమ్మిడి నాయకర్, TDP ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యులు గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించారు. అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు.