SKLM: పాతపట్నం యశోధనగర్లో పాత విద్యుత్ లైన్ల స్థానంలో కొత్త లైన్లు వేస్తున్నందున ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కరెంట్ నిలిచిపోతుందని ఈఈ నరసింహ కుమార్ తెలిపారు. ఎగువ కండర వీధి, దిగువ కండర వీధి, గణేష్ నగర్, ప్రశాంతి నగర్, దుర్గమ్మ కాలనీ 1,2,3, యశోధనగర్, సంపంగి నగర్, విద్యానగర్, నరసింహ నగర్ 1,2 ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు.
ELR: జిల్లాలో జూన్ 1న ఉదయం 7 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.55 లక్షల మంది లబ్ధిదారులకు రూ.113.29 కోట్లను 4,959 మంది సిబ్బంది ద్వారా అందజేస్తామన్నారు. తొలిరోజే వందశాతం పంపిణీ లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వారికి రెండో తేదీన ఇస్తామన్నారు.
అన్నమయ్య: ఓటర్ల జాబితా పునఃపరిశీలన (SIR) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలని YCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లెలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఓట్ల తొలగింపు కుట్రలతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టం జరుగుతుందన్నారు.
GNTR: పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిని విశాఖపట్నం స్పెషల్ హోమ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేసును సమర్థంగా విచారించి శిక్ష పడేలా పనిచేసిన దర్యాప్తు, కోర్టు సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు.
WG: జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
TPT: తిరుపతి కలెక్టరేట్లో స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలకు తొలి రోజు 211 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ప్రముఖ సంస్థల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూల తుది ఎంపిక జాబితాను జూన్ 3న ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
CTR: చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 4న అండర్-15 చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. పాల్గొనేవారు ఈనెల 3వ తేదీ లోపు www.apchess.orgలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. చిత్తూరు వేపమాను వీథిలోని సూల్క్ ఆఫ్ చెస్‌లో పోటీలు జరుగుతాయన్నారు.
KDP: ప్రొద్దుటూరులో శనివారం 13 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.11.34 లక్షల నగదు, 27 సెల్ ఫోన్లు, 1 ట్యాబ్ స్వాధీనం చేసుకున్నట్లు ASP విభుకృష్ణ తెలిపారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అకాడమీ పేరుతో బెట్టింగ్ చేస్తున్న షేక్ జావీద్ మరో 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
E.G: జిల్లాలో ఈ-కేవైసీ ప్రక్రియను పెండింగ్‌లో ఉన్న వారందరూ వెంటనే పూర్తి చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన వీడియో సందేశం ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే 98.71 శాతం ఈ-కేవైసీ పూర్తయిందని, ఇంకా సుమారు 23,000 మంది చేయించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా పూర్తి చేయాలన్నారు.
సత్యసాయి: కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) కళావతి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆమెకు రెవెన్యూ సిబ్బంది, డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. నూతన ఆర్డీవోకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
కోనసీమలో ఆదివారం చికెన్, మటన్ ధరలు పెరిగాయి. ఫారం మాంసం కేజీ రూ.131-135, రిటైల్ లైవ్ రూ.158-162గా ఉంది. బ్రాయిలర్ రకం రూ.246-248, స్కిన్ లెస్ రూ.278-282 వరకు పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మటన్ ధర కిలో రూ.700-800 వరకు ఉంది. సెలవు రోజు కావడంతో మాంసం దుకాణాలు కళకళలాడుతున్నాయి.
ATP: ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. రాప్తాడు నియోజకవర్గ బీఎల్ఏల అవగాహన సదస్సు రజాక్ ఫంక్షన్ హాల్లో జరిగింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కోఆర్డినేటర్ జీను మహేష్‌బాబు, జోనల్ ఇంఛార్జ్ సురేష్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో పట్టణ ప్రణాళికా విభాగం టీపీబీవో రాజారెడ్డి ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లపై చర్యలు చేపట్టారు. రాచర్ల, కృష్ణంశెట్టిపల్లె, కొమరోలు రహదారుల్లోని 12 అక్రమ లే అవుట్లను గుర్తించి, వాటి హద్దురాళ్లు, రహదారులను యంత్రాలతో తొలగించారు. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని, వాటికి భవన నిర్మాణ అనుమతులు లభించవని అధికారులు హెచ్చరించారు.
KDP: బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు కలసపాడు టౌన్లో అధికారు శనివారం దాడులు చేశారు. డి.కృష్ణారెడ్డి దుకాణంలో 4 లీటర్లు, దూదేకుల దస్తగిరిమ్మ దుకాణంలో 7 లీటర్లు, జక్క సుధాకర్ దుకాణంలో 5 లీటర్లు కలిపి మొత్తం 16 లీటర్ల పెట్రోలు సీజ్ చేశారు. అక్రమంగా పెట్రోల్ నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.