సత్యసాయి: నాందేడ్ – ధర్మవరం ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మార్పునకు ఆమోదం తెలిపారు. ఇక నుంచి ఈ రైలు 17635/17636 నంబర్లతో హజూర్ సాహిబ్ నాందేడ్ – ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌గా సేవలు అందించనుంది.
CTR: కుప్పం (M) దాసే గానూరు పంచాయతీలో అక్రమంగా వెలిసిన లేఔట్లలో పంచాయతీ అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన లేఔట్లలో ఎవరైనా స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం జరగదని పంచాయతీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
ఎన్టీఆర్: విజయవాడ గుణదల పడవలరేవు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. పోలీసులను చూసి కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించిన బల్వంత్ అమర్‌సింగ్ సోలంకీ, అల్పేష్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యరమేష్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.
GNTR: జనాభా గణన-2027 విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ తెలిపారు. జనాభా గణనను ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్న ఈ ప్రక్రియలో మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణ జరుగుతుందని వెల్లడించారు.
ATP: పుట్లూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఓబుళరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పాఠశాలలోని పరీక్షా కేంద్రం వద్దకు హాల్ టికెట్‌తో చేరుకోవాలని ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
VZM: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్ నాయకుడు స్పష్టం చేశారు. బుధవారం గరివిడిలోని కొండపాలెం ప్రాంతానికి చెందిన బసవ తిరుమల రావు అనే బాధితునికి ఆయన CMRF కింద మంజూరైన రూ.43,306ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. CMRF అపదలో ఉన్న పేదలకు అండగా ఉంటుందని తెలిపారు.
బాపట్ల: అద్దంకి మండలం చక్రాయపాలెంలో జాలర్ల సంఘం ఎన్నికలు జరుగుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చిన గుర్రం వారిపాలెం గ్రామానికి చెందిన మహంకాళి అనే వ్యక్తి ఎండ తీవ్రతతో కుప్పకూలి, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
W.G: పెంటపాడుకు చెందిన వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మర్రి సాయి కుమార్, గుండుమోగుల నాగేంద్రబాబులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పెంటపాడు పోలీసులు బుధవారం తెలిపారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈనెల 5న ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదుపై నిందితులను అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు.
NDL: దేశానికి అన్నం పెట్టే రైతన్న తన సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంత మాత్రం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, బాబా ఫక్రుద్దీన్ విమర్శించారు. బుధవారం వారు మాట్లాడుతూ.. కొలిమిగుండ్ల మండలంలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం బాధిత రైతులు ఈనెల 10న ధర్నా చేయడానికి సిద్ధమయ్యారన్నారు.
KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు బుధవారం ప్రిన్సిపల్ ఎస్.షమీల తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష రోజు ఉదయం 9:30 గంటలకు స్కూల్‌కు హాజరుకావాలని సూచించారు.
NLR: నెల్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన ARPC రమేశ్ బాబు కుటుంబానికి రూ.1.12 కోట్లు, పీసీ శివకుమార్ కుటుంబానికి రూ.1.10 కోట్ల బీమా చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల బుధవారం సాయంత్రం అందజేశారు. SBI సహకారంతో ఈ మొత్తాన్ని అందజేస్తూ బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
ATP: అనంతపురం JNTU VC సుదర్శన్ రావును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కలిశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణపై చర్చించారు. బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ నిపుణుల బృందాన్ని వీసీకి పరిచయం చేశారు. ఏఐపై పట్టు సాధిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎంపీ తెలిపారు.
E.G: రాజమండ్రి మల్లయ్యపేట సబ్ స్టేషన్ పరిధిలో కండక్టర్ రీప్లేస్మెంట్ పనుల వల్ల గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. కాతేరు, తిరుమల కాలేజీ ఏరియా, దాసరి నగర్, సి.టి.ఆర్.ఐ రోడ్, గణపతి నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు.
కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రు గ్రామ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ వి.ఎస్.దివాకర్‌ను పంచాయతీ కార్యదర్శి రమా శైలజ, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్య దర్శి ఆయనకు పుష్పగుచ్చం అందించి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పొలమూరి బాలకృష్ణ, గుత్తుల చిరంజీవి పాల్గొన్నారు.
GNTR: ASIల నుంచి SI (సివిల్) ఉద్యోగోన్నతుల కోసం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్, పరేడ్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రమోషనల్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. గుంటూరు రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు.