BPT: అడవులదీవి పీఎస్ పరిధిలోని ఒక పాత హత్య కేసులో నిందితుడికి గుంటూరు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మహమ్మాదియపాలెంకు చెందిన 21 మంది నిందితులపై నమోదైన ఈ కేసులో ఇప్పటికే 13 మందికి యావజ్జీవ శిక్ష పడింది. తాజాగా మరో నిందితుడిపై విచారణ పూర్తికావడంతో కోర్టు శనివారం ఈ తీర్పు వెల్లడించిందని ఆయన వివరించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. అదే సమయంలో మినీ కంటైనర్ లారీ ఐచర్ వాహనాలు ఢీకొని రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని CPM జిల్లా కార్యదర్శి గోపాలన్ మండిపడ్డారు. శనివారం విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆయన స్పందిస్తూ, అభివృద్ధి పేరుతో కాకుండా బడాబాబులు, భూస్వాములు, ఆక్వా చెరువుల యజమానులకు స్థలాలు కట్టబెట్టడానికే పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.
KDP: విద్యుత్ బిల్లులను సెలవురోజు అయినా నేడు చెల్లించుకోవచ్చని APSPDCL ఎస్ఈ శ్రీనివాసులు ప్రకటనలో తెలిపారు. ఇవాళ జిల్లావ్యాప్తంగా అన్ని విద్యుత్ బిల్లు వసూలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
GNTR: గుంటూరు జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 13 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. శనివారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర హెని క్రిష్టినా ఉద్యోగులకు ప్రమోషన్ ఆర్డర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు పాల్గొన్నారు.
VZM: బాడంగి పోలీసు స్టేషను నూతన సబ్ ఇన్స్పెక్టర్గా సూర్యకుమారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. భోగాపురం నుంచి బదిలీపై ఆమె ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తారకేశ్వరరావు విజయనగరం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన SI మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
BPT: యద్దనపూడి మండలం అనంతవరంలో కుంచాల వీరకుమారి (27) అనే యువతి శనివారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై రత్నకుమారి కేసు నమోదు చేశారు.
ASR: జిల్లాలో సమస్యల వెలికితీత, పరిష్కార మార్గం చూపే విషయంలో పాత్రికేయులు చూపుతున్న చొరవ అభినందనీయమని కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. జిల్లాలోని సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
SKLM: పాతపట్నం యశోధనగర్లో పాత విద్యుత్ లైన్ల స్థానంలో కొత్త లైన్లు వేస్తున్నందున ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కరెంట్ నిలిచిపోతుందని ఈఈ నరసింహ కుమార్ తెలిపారు. ఎగువ కండర వీధి, దిగువ కండర వీధి, గణేష్ నగర్, ప్రశాంతి నగర్, దుర్గమ్మ కాలనీ 1,2,3, యశోధనగర్, సంపంగి నగర్, విద్యానగర్, నరసింహ నగర్ 1,2 ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు.
ELR: జిల్లాలో జూన్ 1న ఉదయం 7 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.55 లక్షల మంది లబ్ధిదారులకు రూ.113.29 కోట్లను 4,959 మంది సిబ్బంది ద్వారా అందజేస్తామన్నారు. తొలిరోజే వందశాతం పంపిణీ లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వారికి రెండో తేదీన ఇస్తామన్నారు.
అన్నమయ్య: ఓటర్ల జాబితా పునఃపరిశీలన (SIR) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలని YCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లెలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఓట్ల తొలగింపు కుట్రలతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టం జరుగుతుందన్నారు.
GNTR: పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిని విశాఖపట్నం స్పెషల్ హోమ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేసును సమర్థంగా విచారించి శిక్ష పడేలా పనిచేసిన దర్యాప్తు, కోర్టు సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు అభినందించారు.
WG: జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
TPT: తిరుపతి కలెక్టరేట్లో స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలకు తొలి రోజు 211 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ప్రముఖ సంస్థల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూల తుది ఎంపిక జాబితాను జూన్ 3న ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.