SKLM: ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘గ్రీవెన్స్’ కార్యక్రమం నిర్వహించారు. అర్జీదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా 61 వినతులు స్వీకరించినట్లు తెలిపారు.
VZM: ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలో యువకులు, విద్యార్థుల స్మార్ట్ ఫోన్లను పరిశీలించి చేసి బెట్టింగ్ యాప్‌లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగులతో యువత, విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.
ASR: జీకేవీధి మండలంలోని అమ్మవారి దారకొండ గ్రామంలో సోమవారం భారీ విష సర్పం హల్ చల్ చేసింది. సుమారు 15 అడుగుల భారీ విష సర్పాన్ని చూసిన గ్రామస్థులు భయాందోళన చెందారు. ఓ రైతు పొలానికి వెళ్లి వస్తుండగా, భారీ విష సర్పం కాటు వేయడానికి ప్రయత్నించింది. అతడు తృటిలో తప్పించుకున్నాడు. వెంటనే పలువురు అక్కడికి చేరుకుని, ప్రాణ భయంతో ఆ భారీ విష సర్పాన్ని హతమార్చారు.
KRNL: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన మంత్రాలయం ZPHS విద్యార్థులకు సోమవారం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు రాజస్థాన్‌లో జరగనున్న పోటీలకు వెళ్లే ముగ్గురు విద్యార్థులకు రూ.20 వేలు అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్ర నరసింహ రాజు పేర్కొన్నారు.
GNTR: తెనాలి మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్ సభ్యులు, ప్లాస్టిక్ విక్రయదారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగించాలని సూచించారు.
E.G: పోలవరం జిల్లా కొయ్యలవీరవరం, లింగంపల్లి కొండల్లో పులి ఉన్నట్లు శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా అధికారులు సోమవారం గుర్తించారు. ఇది పాపికొండల నేషనల్ పార్క్ సమీపంలో ఉండటంతో నిర్వాసిత గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉన్నా, కొండ దిగువన ఉన్న పశువులపై పులి దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
NLR: బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు కార్తీక్ డబ్బుల కోసం తన కుమార్తెను వేధించేవాడని ఆ వేధింపుల వల్లే ఆమె మరణించిందని ఆరోపించింది. బాధ్యుడైన కార్తీక్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరాగా దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PPM: టెన్త్ నుంచే విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు కోసం స్పష్టమైన కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని JC యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న స్దానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కెరీర్ ఫెస్ట్-2026 ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఒత్తిడితో కాకుండా స్వయం ప్రతిభను గుర్తించి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
KDP: సిద్దవటం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దవటం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
ATP: మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం అనంతపురంలో పర్యటించనున్నారు. ఉదయం రాంనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్, హంద్రీనీవా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.లక్ష విరాళంగా వచ్చినట్లు సోమవారం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే భక్తుడు విరాళం అందజేశారన్నారు. ఈ విరాళాన్ని అన్నదాన పథకానికి వినియోగించాలని భక్తుడు కోరారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన కల్పించి, ఆశీర్వచనాలు అందజేశారు.
BPT: ఈ నెల 9న సీఎం సూరేపల్లి రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ నేత రమేష్ రాంజీ ఓ లేఖ విడుదల చేశారు. రేపల్లె డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఓలేరు వద్ద చెక్ డ్యాం నిర్మించాలన్నారు. జంపనిలో పారిశ్రామికవాడ, రేపల్లెలో పీజీ సెంటర్, ఆటోనగర్ ఏర్పాటు చేయాలన్నారు. భట్టిప్రోలు బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
W.G: వీరవాసరం జెడ్‌పీ హైస్కూల్ వద్ద FAPTO ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొత్త పీఆర్‌సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఛైర్మన్ విజయరామరాజు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ రంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ నిరసనలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
VZM: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి పేర్కొన్నారు. సోమవారం ముక్కాం పంచాయితీలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ట్రాన్స్‌పాండర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ… PM మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY ) పథకం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు.
SKLM: నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలి అని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం సాయంత్రం అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జలధార – జలహారతి’ పనులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని కాలువలు, చెరువులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.