E.G: ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో రెరా చట్టం-2016పై రాజమండ్రి హోటల్ మంజీరాలో ఏప్రిల్ 29న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఛైర్మన్ ఆరె శివారెడ్డి మంగళవారం తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ELR: కామవరపుకోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ నండూరి శేషావతారం మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. సీనియర్ ఆడిటర్‌గా జిల్లాలో మంచి గుర్తింపు పొందిన శేషావతారం మరణం పట్ల పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో ఇవాళ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కార్యాలయ అధికారి శ్రీనివాసులు ప్రకటించారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దాదాపు 880 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
CTR: కార్వేటినగరం (M) అమ్మపల్లిలో మహాభారతం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అర్జున తపస్సు ఇవాళ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో ఇప్పటికే సాంప్రదాయ పద్దతిలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కార్వేటినగరంతో పాటు పక్క మండలాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
WG: జిల్లాలో భూ సమస్యల త్వరితగతిన పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రెవెన్యూ క్లినిక్‌లు’ సత్ఫలితాలు ఇస్తున్నాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అందిన 609 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 310 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. మరో 299 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.
ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. స్త్రీరక్ష పోర్టల్ ద్వారా సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లవచ్చని పోలీసులు వివరించారు. శక్తి యాప్ వినియోగం, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు యాప్ ఏ విధంగా రక్షణ ఇస్తుందో ప్రత్యక్షంగా చూపారు.
VSP: కేజీహెచ్ శిశు వైద్య విభాగం భాగస్వామ్యంతో నిర్వహించిన కీలక పరిశోధన అంతర్జాతీయ జర్నల్ The Lancet Regional హెల్త్ సౌత్ ఆసియా లో ప్రచురితమైంది. దేశీయంగా తయారైన ‘ప్న్యూబెవాక్స్-14’ వ్యాక్సిన్ సురక్షితత, ప్రభావంపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. ఈ పరిశోధనకు డాక్టర్ బి.ఎస్. చక్రవర్తి నేతృత్వం వహించారు.
NLR: ఔట్సోర్సింగ్ కార్మికులు తప్పనిసరిగా ESI, EPFకు నమోదు చేసుకోవాలని నెల్లూరు డీఆర్వో విజయ కుమార్ మంగళవారం కోరారు. ఈ-నామినేషన్ నమోదు కార్యక్రమం ఈనెల 29 నుంచి 30వ తేదీ వరకు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని అధికారులు తమ పరిధిలో ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
NDL: విశాఖలోని VMRDAలో ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని CM CBN, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు. వచ్చే జూన్ 1 నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కోరగా కేంద్ర మంత్రి అంగీకరించారు. కర్నూలు- డోన్‌ను కొత్త జోన్లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
KDP: సిద్దవటం శివారులోని అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి SI హారిక వాహనాల తనిఖీ చేపట్టారు. బద్వేలు, కడప వైపు నుంచి వచ్చిన పలు రకాల వాహనాలను నిలిపి వాటి రికార్డులు పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఎస్సై సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేశారు.
VZM: ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా KGBV టీచర్స్‌కు జరుగుతున్న అశాస్తీయ బదిలీలను వెంటనే రద్దు చేయాలని KGBV టీచర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె.విజయ గౌరి కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని కలసి వినతి పత్రం అందించారు. మౌలికమైన ఆదేశాలతో జరుగుతున్న ఈ బదిలీల వల్ల టీచర్లకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
BPT: అద్దంకి మండలం సింగరకొండలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలను ఈ నెల 30న వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. స్వామివారికి విశేషమైన సుగంధ పరిమళాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు వివరించారు.
KRNL: పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం తగదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. ఆశోక్ నగర్, పాతబస్తీ, కల్లూరు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. చిన్న, మధ్య కాలువల్లో ప్రతివారం పూడికతీత తీయాలని, మధ్యాహ్నం గ్యాంగ్ వర్కర్లతో ప్రత్యేకంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. వ్యర్థాలను 24 గంటల్లో తొలగించాలన్నారు.
E.G: 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాజమండ్రి నగరపాలక సంస్థకు రూ. 18946.50 లక్షల ఆదాయం సమకూరనున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వార్షిక బడ్జెట్ వివరాలను ఆయన తెలిపారు. ఇదే కాలంలో సాధారణ నిధుల నుంచి వివిధ విభాగాలలో రూ.24875.30 లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేశారు.
ప్రకాశం: పీసీపల్లి మండలం పిల్లివారిపల్లిలో అభయాంజనేయ స్వామి, కాశినాయన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి వైసీపీ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, కమిటీ సభ్యులు శేష వస్త్రాలతో అతిథులను సత్కరించారు.