CTR: పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం ఎగువ వెంకటాపురం ఎంపీపీ స్కూల్లో చెట్ల తొలగింపుపై గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోను సంప్రదించి చెట్లను తొలగించవద్దని కోరారు. ఎంఈవో, తహసీల్దార్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
AKP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రాంబాబు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరక్కుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల సమయంలో నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. అలాగే, ఎస్. రాయవరం అడ్డరోడ్డు జంక్షన్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన కల్పించారు.
VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి కుమారి అనే యువతి గదిలో ఉరేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
AKP: పాయకరావుపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అన్న క్యాంటీన్ పనులను బుధవారం మండల అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వరహాలు బాబు, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిబాబు పాల్గొన్నారు.
ATP: ముంబై(CSMT) నుంచి చెన్నై వెళ్లే సమ్మర్ స్పెషల్ రైలు, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, మీదుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ రైలు ప్రతి ఆదివారం ముంబై (రైలు నెం 01015) నుంచి బయలుదేరుతున్నట్లు తెలిపారు. చెన్నై (రైలు నెం 01016) నుంచి ప్రతి సోమవారం బయలుదేరనుందన్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులు రద్దీ రీత్యా నడపనున్నట్లు తెలిపారు.
VZM: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్, అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు సమక్షంలో బొబ్బిలిలో 9వ వార్డుకు చెందిన ముడశల దుర్గాప్రసాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణంలోని 36 వార్డుల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు.
ASR: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి స్వర్ణ గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆయన బుధవారం చింతూరు గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనమిత్ర యాప్ ద్వారా అందుతున్న సేవలపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.
TPT: సూళ్లూరుపేట మండల నూతన తహసీల్దార్‌గా శైలకుమారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దొరవారిసత్రం తహసీల్దార్‌గా పనిచేసిన అనుభవంతో మండల పరిపాలనపై మంచి పట్టున్న ఆమె, రెవెన్యూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజా అర్జీల పరిష్కారంలో జాప్యం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
AKP: పాయకరావుపేట మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు జాబితాలను ప్రదర్శించినట్లు ఎంపీడీవో లవరాజు బుధవారం తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు అందరూ ఓటరు జాబితాలను పరిశీలించి పొరపాట్లు, తప్పులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
VSP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటీవల టీడీపీ ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు కీలకమైన పొలిట్ బ్యూరోలోనూ ఆయనకు, ఆయన కుమారుడు రవితేజకు పార్టీ అధిష్ఠానం మొండి చేయి చూపింది. మంత్రివర్గంలో స్థానం దక్కించుకోలేకపోయిన గంటా తాజాగా పార్టీ పదవుల్లోనూ ఎలాంటి ప్రాధాన్యం లభించకపోవడంతో నిరాశకు గురయ్యాయి.
ATP: CM చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం సందర్భంగా రాయదుర్గం శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కుటుంబం ఆధ్వర్యంలో పది రోజుల పాటు నిర్వహించే హోమాల్లో భాగంగా ఐదో రోజు భైరవి దేవి హోమం నిర్వహించారు. CM నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో వంట గ్యాస్ తీవ్ర కొరత నెలకొనడంతో గిరిజనులు మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో కుటుంబాలు అడవుల నుంచి కట్టెలు సేకరించి వంట చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ రోజుల తరబడి సిలిండర్లు రాకపోవడం, కొన్నిచోట్ల 20–30 రోజుల వరకు ఆలస్యం జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.
VSP: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి టీడీపీ బలోపేతానికి కృషి చేసిన ప్రణవ్ గోపాల్‌కు రాష్ట్ర కమిటీలో కీలక పదవి లభించింది. కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామకం జరగడంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. అతి చిన్న వయసులోనే ఈ స్థానం దక్కించుకోవడం విశేషంగా మారింది. ప్రస్తుతం వీఎంఆర్డీఏ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఆయనకు పార్టీ మరింత బాధ్యతలు అప్పగించింది.
NDL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు కీలక పదవి వరించడంతో శబరి అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలువురికి కృతజ్ఞతలు తెలియజేసింది.
VZM: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పోరాటంతో పార్టీకి చారిత్రాత్మక విజయం అందించిన లోకేశ్ ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో, మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నారు.