ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఈనెల 18, 19 తేదీల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తుల మేళా నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ భాషా తెలిపారు. ఈ మేళాలో 80 మంది రైతులతో 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని, 150 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఈ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. భవన నిర్మాణ రంగానికి ఇబ్బంది లేకుండా డిమాండ్ మేరకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే జొన్నాడ, కపిలేశ్వరపురం, రావులపాడు, ఆలమూరు స్టాక్ పాయింట్లలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలని సూచించారు.
ATP: విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. నిందితులను సత్వరమే అరెస్ట్ చేయడం, దర్యాప్తును సకాలంలో నాణ్యతగా పూర్తి చేయడం వంటి విధుల్లో రాణించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, మహిళా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించిన వారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ELR: స్వయం ఉపాధితో జీవనం సాగించడానికి తనకి చేయూత కావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను ఓ యువతి కోరింది. ప్రభుత్వం చాయ్ రాస్తా వ్యాపారం చేసుకోవడానికి సెర్ప్ ద్వారా చేయూత అందిస్తోందని అందుకు స్థలాన్ని కేటాయించే విధంగా సహకరించాలని కోరింది. చాయ్ రాస్తా వ్యాపారం నిమిత్తం స్థలాన్ని కేటాయింపు చేయాల్సిందిగా చింతలపూడి మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
NDL: కొలిమిగుండ్ల మండల ఇంఛార్జ్ తహసీల్దార్‌గా నాగేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఇంఛార్జ్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సాయి విశ్వతేజ పది రోజుల క్రితం సెలవులపై వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు నాగేశ్వర రెడ్డిని కొలిమిగుండ్ల మండలం ఇంఛార్జ్ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు.
KRNL: ఆస్తి పన్ను చెల్లింపులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ ఓ ప్రకటనలో కోరారు. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తే 50 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం నగరంలో 6 ప్రత్యేక కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
NDL: డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ శుక్రవారం ఉదయం 10 గంటలకు బేతంచెర్లకు వస్తున్నట్లు టీడీపీ మండల నాయకులు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె అందుబాటులో ఉంటారన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లవచ్చని చెప్పారు.
PPM: స్థానిక గాయత్రి అపార్ట్‌మెంట్‌లో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు, సిబ్బంది గృహిణులకు నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.బహిరంగ మంటలు నిషేధం అని సూచించారు.
KKD: ఏలేశ్వరం(M) చిన్నింపేట జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున భారీ ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి కత్తిపూడి వెళ్తున్న బొలెరో వాహన డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను దాటి, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ధాటికి లారీ డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: జిల్లాలో జలాశయాలు, ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా ఆక్రమణలను వెంటనే తొలగించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన వాచ్‌డాగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మవరం చెరువులో గుర్తించిన 290 ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ చేయాలని సూచించారు.
KDP: చింతకొమ్మదిన్నె పరిధిలోని మామిళ్లపల్లెలో అక్రమంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 11.49 లక్షల విలువైన 479 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన మహబూబ్ షరీఫ్ భారీగా సిలిండర్లను నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించి, ఆయనపై కేసు నమోదు చేశారు.
W.G: భీమవరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అహ్మదునిషా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి యాప్’ మహిళలకు అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుందని, ప్రతి విద్యార్థిని తమ స్మార్ట్ ఫోన్లలో దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఈ యాప్ ఎంతో తోడ్పడుతుందని వివరించారు.
KDP: ప్రతి ద్విచక్ర వాహనదారుడు లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని SI హారిక తెలిపారు. సిద్ధవటం గ్రామ శివారులోని మూలపల్లె క్రాస్ వద్ద గురువారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. హెల్మెట్, వాహన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనదారులకు ఒక్కొ వాహనానికి రూ.185 చొప్పున జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.
కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సహకారంతో చదువుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినిని మంత్రి వాసంశెట్టి సుభాష్, ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలు గురువారం సాయంత్రం కలిసి అభినందించారు. కాకినాడ శ్రీ చైతన్యలో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ చదువుతున్న కాటే శ్రీకృష్ణ హర్ష 470 మార్కులకు గాను 459 మార్కులుతో ఉత్తీర్ణత సాధించాడు.
ATP: ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. పరీక్ష ఫీజు ఈ నెల 20 నుంచి 27వ తేదీలోగా ఆన్‌లైన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీటోటలింగ్ చేయించుకోవాలనుకుంటే ఫీజు చెల్లించుకోవచ్చున్నారు. సబ్జెక్టుకు 260 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు.