సత్యసాయి: హిందూపురం పట్టణంలోని విద్యాసంస్థల సమీపంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చిన్న మార్కెట్, బోయపేట తదితర ప్రాంతాల్లోని షాపుల్లో సోదాలు చేసి నిషేధిత గుట్కా, ఖైనీ, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. యువత ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు.
ATP: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని అనంతపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. సమాజ సేవకు అంకితమైన ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని బస్వాపురం టోల్ ప్లాజా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో స్థానికులు ఓ గుర్తుతెలియని మగ శవాన్ని గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు ఐదు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని కాల్చి పడవేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
KRNL: ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
విశాఖలో హెడ్ నర్సుల పదోన్నతులపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వ నర్సుల సంఘం ఖండించింది. గంగా భవానీ, జీవీఎస్ వరలక్ష్మి నేతృత్వంలో 39 మంది విచారణకు హాజరై పూర్తి వివరాలు సమర్పించారు. ఫిర్యాదుదారులు హాజరుకాకపోవడంతో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పదోన్నతుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదని తెలిపారు.
SKLM: గ్రామాల అభివృద్ధికి సర్పంచుల చేసిన సేవలు అమూల్యం అని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. కొత్తూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన సర్పంచులను ఘన సత్కారం చేసి మెమొంటోలు అందజేశారు. గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
TPT: నాయుడుపేట మండలం శ్రీరామ్ నగర్‌లో పట్టపగలు దుండగులు మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును అపహరించి పరారయ్యారు. గిరిజమ్మ అనే మహిళ ఇంటి ముందు ఉన్న సమాయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వాటర్ ప్యాకెట్లు, చాక్లెట్లు అడిగి మాయచేశారు. అనంతరం ఒక్కసారిగా మెడలో ఉన్న గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BPT: వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న పోషణ పక్వాడ 8వ ఎడిషన్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ టీ. ప్రియాంక మాట్లాడుతూ.. శిశువు జననం నుంచి తొలి ఆరు సంవత్సరాల లోపు మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.
PLD: దాచేపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రాజేశ్ గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఒంగోలు నుంచి బదిలీపై దాచేపల్లికి వచ్చారు. ఇప్పటివరకు సీఐగా పనిచేసిన భాస్కర్ వివాహేతర సంబంధం నేపథ్యంలో వీఆర్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. రాజేశ్‌కు ఎస్సైలు, స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
E.G: రాష్ట్రంలో దళిత సామాజికవర్గ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ MP హర్షకుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆకివీడు ఘటనలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గురువారం విడుదలైన 10 మందిని ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం కుల, మతాల స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.
సత్యసాయి: కొత్తచెరువు మండలం లోచర్ల పంచాయతీ మామిళ్లకుంట క్రాస్ వద్ద టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
NLR: కందుకూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గురువారం సందర్శించి, అమ్మకాలను ప్రారంభించారు. ప్రారంభ ధర కిలోకు రూ.250గా నిర్ణయించగా.. 9 కంపెనీలే పాల్గొనడంతో రైతుల్లో నిరాశ కనిపించింది. రైతులు తొందరపడకుండా గ్రేడింగ్ చేసి, మార్కెట్ పరిస్థితులు చూసి అమ్మకాలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ATP: రాయదుర్గం మండలం డీ.కొండాపురం గ్రామంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు పారదర్శకతకు ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి రైతుకు చట్టబద్ధమైన రక్షణ అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
KRNL: మంత్రాలయం మండలం సూగురు గ్రామంలోని శ్రీ వీరలింగేశ్వర స్వామి, ఆసమండేశ్వర స్వామి దేవాలయ భూమిని కబ్జాదారుల నుంచి విడిపించాలని గురువారం హిందూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవస్థాన కమిటీ సభ్యులు గురుమూర్తి, జనార్ధన్ PSలో వినతి పత్రం అందజేశారు.
W.G: తణుకులో ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ అధికారులు గురువారం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల నుంచి సుమారు 350 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.