ATP: యల్లనూరు మండలంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ చంద్రశేఖర్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలోని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు రూ.150 ప్రభుత్వ రుసుం చెల్లిస్తే చాలన్నారు.
KDP: కమలాపురం మండలం పెద్దచెప్పలిలో ఈనెల 18న ఎల్లమ్మ తిరుణాల మహోత్సవ సందర్భంగా ఎద్దులచే బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. పోటీలో మొదటి విజేతకు రూ.1,20,000, లతో పాటు ఎలక్ట్రికల్ స్కూటర్, 2వ బహుమతి రూ. లక్ష, 3వ బహుమతి రూ. 80,000, 4వ బహుమతి రూ.60,000, ఇలా వరుసగా 11 బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
W.G: కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు విమర్శించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
VZM: గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మత్తు పదార్దాలు వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని పేర్కొన్నారు.
ELR: జిల్లా కేంద్రంలోని జ్యూట్ మిల్ ఫ్లై ఓవర్ పై నుండి పాసింజర్ ఆటో మంగళవారం రాత్రి అదుపుతప్పి కింద పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ ను వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
NTR: తిరువూరు పట్టణంలో జరుగుతున్న పరిశుభ్రత పనులను మున్సిపల్ కమిషనర్ కె.మనోజ బుధవారం ఉదయం పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ చెత్తను సమయానికి తరలించాలని, వీధులు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ATP: అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శివన్నకు రూ.2,45,859, నాగప్పకు రూ.1,01,208ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.
NLR: మర్రిపాడు మండలం నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చుంచులూరు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న ఓ మినీ ట్రక్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. వాహనంలో ఉన్న చికెన్ వ్యర్ధాలను రెవెన్యూ సిబ్బందితో కలిసి పూడ్చిపెట్టారు.
KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గొల్లప్రోలు నగర పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిందని పిఠాపురం పాడా పీడీ శివరాం ప్రసాద్ తెలిపారు. దీంతో అదనపు సిబ్బంది నియామకంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రోడ్లు, మౌలిక వసతుల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు.
VZM: తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు పాకలపాటి సాంబశివరాజు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన 2005 -10 మద్య మానసాస్ ట్రస్ట్‌కు కరస్పాండెంట్‌గా కూడా వ్యవహరించారు. రెండు సార్లు కోపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఈయన అకాల మృతికి పలువురు నాయకులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు.
AKP: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. ఉపాధ్యాయులు రోజుకు రెండు గంటలు ఎన్‌రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరిస్తున్నారన్నారు.
Vsp: గాజువాకలో ప్రియురాలు మౌనికను హత్య చేసిన నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్రను పోలీసులు మంగళవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 29న జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు గాజువాక పోలీసులు కోర్టును ఆశ్రయించగా, నిందితుడికి మూడు రోజుల కస్టడీ మంజూరైంది. ఈ విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలను వెలికితీయనున్నారు.
PPM: రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంద్యారాణి మంగళవారం సాలూరులో 7 కొత్త పైలట్ వాటర్ స్కీమ్‌లను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంబించామని, స్దానిక 2, 3,5,6,7,19 వార్డుల్లో ఈ స్కీమ్స్‌ను అమలు చేశామన్నారు. ఒక్కో స్కీమ్‌కు రూ.1.80 లక్షల వ్యయం కాగా, మొత్తం 12.60 లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని విద్యానగర్‌లో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పాములేటి వెంకటరమణమ్మ ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇంట్లోని సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో ప్రమాదం పక్క ఇళ్లకు వ్యాపించకుండా నివారించగలిగారు.
PPM: సంకాడ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న కడుగుల వాసి ధనుష్ అకస్మాత్తుగా అడ్డువచ్చిన ఆవులను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయ్యింది. స్థానికులు గమణించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబుల్స్‌లోనే ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.