NTR: జగ్గయ్యపేటలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా పుస్తకాల విక్రయం పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నాయని SFI ఆరోపించింది. ఫీజు నియంత్రణ చట్టానికి విరుద్ధంగా అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు వినతిపత్రం అందజేసిన ఎస్‌ఎఫ్‌ఐ, స్పందన లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.
NTR: జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో 60 రోజుల హుండీ ఆదాయం రూ. 91.95 లక్షలు నమోదైంది. హుండీ లెక్కింపులో 25 గ్రాముల మిశ్రమ బంగారం, 380 గ్రాముల మిశ్రమ వెండి లభించాయి. అలాగే అమెరికా, లండన్, బ్రెజిల్, లిబియా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ELR: జలధార- జలహారతి పనులపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాల్వలు, చెరువుల్లో కనీసం 2 అడుగుల మేర పూడికతీత చేపట్టాలని పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. జూన్ 15 లోపు మంజూరైన పనులన్నింటినీ పూర్తి చేసి ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు.
కోనసీమ: జిల్లాలోని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబీ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. రాజోలు మండలంలో 200 మంది రైతులకు చెందిన 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ పూర్తయిందన్న నెపంతో కొనడం లేదన్నారు. పక్క జిల్లాల నుంచైనా ధాన్యం కొనుగోలుకి అనుమతి ఇవ్వాలని జేసీని కోరినట్లు తెలిపారు.
SKLM: రణస్థలం మండలం జీరుపాలెం సముద్ర తీరంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మెరైన్ ఫిష్ సీడ్ లాంచింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సముద్రపు చేప పిల్లలను విడుదల చేశారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, రెండేళ్లలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించి వలసలు నివారిస్తామన్నారు.
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి, ములకల గుమడాం గ్రామాల్లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు శనివారం ఉపాధి కూలీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళ సాధికారత, సైబర్ నేరాలు, గంజాయి నియంత్రణ మహిళా చట్టాలపై గజపతినగరం CI ఎస్.సన్యాసినాయుడు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో SI కిరణ్ కుమార్ నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
W.G: పోలీసు విభాగంలో సుదీర్ఘ కాలం పాటు చిత్తశుద్ధితో సేవలందించి పదవీ విరమణ పొందిన 11 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. పాలకోడేరు (M) గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి జ్ఞాపికలను అందజేశారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
AKP: అచ్యుతాపురం సెజ్‌లోని ప్రముఖ అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థ ‘బ్రాండిక్స్’ ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం సందర్శించారు. సంస్థలో జరుగుతున్న వస్త్ర ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల ప్రక్రియను బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్, భారతీయ భాగస్వామి దొరస్వామి మంత్రికి క్షుణ్ణంగా వివరించారు.
విశాఖ కార్మిక శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ యజమానులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం. రామరావు మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో చల్లని తాగునీరు, ప్రథమ చికిత్స సామగ్రి, ORS ప్యాకెట్లు, ఐస్ ప్యాక్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
ASR: కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం పాడేరులో సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలకు కార్మికవర్గం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.
GNTR: పొగాకు వినియోగించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే. విజయలక్ష్మి హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెంలో సిబార్ వైద్య విద్యార్థులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పాల్గొన్నారు.
మన్యం జిల్లాలో ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలుతీరును అడిగి తెలుసుకున్నారు.
CTR: చిత్తూరు సాయుధ దళ కార్యాలయంలో ఆధునిక సదుపాయాలతో నవీకరించిన జిమ్‌ను ఎస్పీ తుషార్ శనివారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరిక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ, విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించేందుకు ఈ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.
అన్నమయ్య: రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన “క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. డ్రైనేజీల శుభ్రపరిచే పనులను పరిశీలించిన ఆయన, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు.ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను నిర్లక్ష్యంగా వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
VZM: టీడీపీ పార్టీ సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామి నాయుడును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ జిల్లాలోని వారి నివాసానికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన మీ లాంటి సీనియర్ నాయకులు మాలాంటి వారికి మార్గదర్శకులని మంత్రి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు మంత్రిని ఆప్యాయంగా పలకరించారు.