కుప్పం నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం టీడీపీ మాత్రమే గెలుస్తూ వస్తోంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండటమే కారణం. ఆ ప్రాంత వాసులకు టీడీపీ మీద ఉన్న, చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో ఆయనను గెలిపిస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం అక్కడ అలా ఉండదని.. చంద్రబాబు ఇలాకలో తమ పార్టీ జెండా పాతి తీరతామని వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు.
కుప్పంలో టీడీపీ ని ఓడించి.. వైసీపీ ని గెలిపించి తీరతామని ఆ పార్టీ నేత భరత్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సైతం… కుప్పంలో తమ పార్టీ గెలిస్తే.. అక్కడ పోటీ చేసిన నేత భరత్ కి మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. అక్కడ వైసీపీ గెలుపుకోసం భరత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
గత కొంతకాలంగా కుప్పంలో చంద్రబాబు పర్యటించిన ప్రతిసారీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పర్యటనలపై వైసీపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలకు వైసీపీ సర్కారు ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు, ఎన్ఎస్జీ రక్షణలో వున్నప్పటికీ చంద్రబాబుపై దాడికి యత్నిస్తున్నారు.
పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో వైసీపీ కార్యకర్తలు కుప్పంలో మరింత చెలరేగిపోతున్నారు.మరోపక్క, వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడంలో చంద్రబాబు తనదైన వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. ఏదన్నా అనుకోని ఘటన జరిగితే, తన పట్ల సింపతీ పెరుగుతుందని చంద్రబాబు భావిస్తోంటే, చంద్రబాబు మీద దాడి చేసైనాసరే.. కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించాలనే లక్ష్యంతో స్థానిక వైసీపీ నాయకత్వం వున్నట్లు కనిపిస్తోంది.