నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. 3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు మరో ఫోన్ ఉందన్నారు. 12 సిమ్ కార్డులు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ను పెగాసస్ రికార్డు చేయలేదని స్పష్టంచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? నియోజకవర్గంలో ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ కేసుల సమయంలో తనపై ఒక ఎస్పీ నిఘా పెట్టారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని వివరించారు. వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని.. ఎదగలేదని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలో కొన్ని కుటుంబాలు అడ్డుకున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పలుసార్లు తన గొంతును కోశాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. పదవులు అన్నీ వారే అనుభవిస్తున్నారని వివరించారు. తాను రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని స్పష్టంచేశారు. సామాన్యుడిగా పార్టీ జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మినిస్టర్ పోస్ట్ దక్కుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశపడ్డారు. సామాజిక సమీకరణాలు, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ అవకాశం ఇవ్వలేదు. అప్పటినుంచి అధికార పార్టీ, సీఎం జగన్‌పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. సమయం దొరికితే చాలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ మారుతాననే సంకేతాలను మాత్రం ఇండైరెక్టుగా ఇస్తున్నారు.