ఓ మహిళ ఏదైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది కానీ.. తాను కట్టుకున్న భర్తను షేర్ చేసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. అంతెందుకు.. ఎవరైనా పరాయి స్త్రీ తన భర్త వైపు చూసినా ఊరుకోరు. భర్త ఎవరితోనైనా మాట్లాడినా తట్టుకోలేరు. అలాంటిది ఓ మహిళ.. తన భర్తను… అతను ప్రేమించిన అమ్మాయితో దగ్గరుండి మరీ పెళ్లి చేసింది. ఈ సంఘటన తిరుపతిలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ యువకుడు టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూంటాడు. అదే సమయంలో వైజాగ్ కు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కొన్నాళ్లు చట్టపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలీదు కానీ.. ఆ అబ్బాయి ఆమె నుంచి దూరమయ్యాడు. అనంతరం అతనికి టిక్ టాక్ లో కడపకు చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కూడా ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అంతా బాగుంది అనేసరికి ఆ అబ్బాయి మొదటి ప్రియురాలు మళ్లీ తిరిగొచ్చింది. అతనికి పెళ్లయిన విషయం తెలుసుకుని బాధపడింది. అనంతరం ఆ బాధ నుంచి కోలుకున్నాక తన బాయ్ ఫ్రెండ్ మొదటి భార్యతో తాను కూడా ఇక్కడే ఉండిపోతానని, ముగ్గురూ కలిసి ఉందామని చెప్పింది. ఆ అమ్మాయి మాటలకు ఖంగుతున్న భార్య మొదట అయోమయానికి గురయ్యింది. వారిద్దరి పెళ్లికి ఏ మాత్రం ఒప్పుకోలేదు.
అలా రోజులు గడుస్తున్న కొద్దీ.. చివరికి మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకుంది. లవర్ తో తన భర్తకు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యింది. బుధవారం తానే దగ్గరుండి మరీ తన భర్తకు లవర్ తో పెళ్లి జరిపించింది. ప్రస్తుతం వీరి పెళ్లి వైరల్ గా మారింది.