రణస్థలంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు పైన, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీకి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఆయనకు రివర్స్ అయ్యాయి. పవన్ ప్రతి అంశాన్ని సూటిగా మాట్లాడుతారని జనసైనికులు చెప్పవచ్చు. కానీ రాజకీయాల్లో కొన్ని చెల్లుబాటు కావు. చిన్న తడబాటును కూడా విపక్షాలు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ బయటకు రాగానే పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్ వంటి వైసీపీ నేతలు మాటల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దానిని నిజం చేస్తూ శ్రీకాకుళం జనసేన సభ పూర్తి కాగానే సోషల్ మీడియాలో, ప్రెస్‌మీట్ ద్వారా టార్గెట్ చేశారు.
పవన్ వ్యాఖ్యలు ఆయుధంగా
పవన్ మీడియా సమావేశం, సభల తర్వాత వైసీపీ నేతల విమర్శలు సహజమే! అయితే జనసేనాని నిన్న మాట్లాడిన రెండుమూడు అంశాలు వారికి ఆయుధంగా మారాయి. ప్రధానంగా వాటిని లేవనెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబుతో రెండున్నర గంటల భేటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
వివరణ ఎందుకు?
వైసీపీ నేతలు పదేపదే చంద్రబాబుతో రెండున్నర గంటలు ఏం మాట్లాడారని అడుగుతున్నారని, అలా గుసగుసలు ఎందుకు, నేనే చెబుతాను అంటూ మొదటి 10 నిమిషాలు కుశల ప్రశ్నలు, తర్వాత పోలవరం నిర్మాణంలో జాప్యం, 23 నిమిషాలు మంత్రి సంబరాల రాంబాబు పనితీరుపై, 18 నిమిషాలు పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని 15వ స్థాంలో నిలిపిన ఐటీ శాఖ మంత్రిపై, ఆ తర్వాత టీ తాగామని, అనంతరం రాష్ట్ర భవిష్యత్తుపై చర్చించి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చంద్రబాబుకు చెప్పానని, ఆ రెండున్నర గంటల్లో జరిగింది ఇది అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇరువురు నేతలు టైమ్ బాండ్ ఇలా సరిగ్గా టైమ్ బాండ్ పెట్టుకొని మాట్లాడుతారని ఎవరూ అనుకోరు. కానీ వైసీపీ పదేపదే ప్రశ్నించడంతో యథాలాపంగా పవన్ ఒక్కోటి ఇన్ని నిమిషాలు మాట్లాడామని సెటైరికల్‌గా కూడా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఇలాంటి వివరణ, పైగా నిమిషాలతో సహా చెప్పడాన్ని డిఫెన్స్‌లో పడేస్తుంది. అందుకే వైసీపీ నేతలంతా దీనిని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
పొత్తుపై కూడా ఆయనకే క్లారిటీ లేనట్లుగా ఉందని వైసీపీ నిలదీస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తామని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని బలంగా చెబుతూనే, తమకు గౌరవప్రదంగా ఉండాలన్నారు. అయితే ఎన్ని సీట్లు ఇస్తే పవన్‌కు గౌరవప్రదమో చెప్పాలని వైసీపీ నిలదీస్తోంది. 175 స్థానాల్లో జనసేన సగం కోరుకుంటుందా? పవన్‌కు ముఖ్యమంత్రి స్థానం అడుగుతోందా? అనే ప్రశ్న అందరిలోను ఉదయిస్తుంది. ఇక వైసీపీ అయితే ఓ అడుగు ముందుకేసి, గౌరవప్రదం అంటే చంద్రబాబు ఆయనకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బరువు అంటూ ఎద్దేవా చేస్తోంది.
గ్యారెంటీ కార్డు
జనసైనికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి ఆయుధంగా మారాయి. ఓట్లు చీలకూడదని, వ్యూహం ఉండాలని, ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని పవన్ నిన్నటి సభలో అన్నారు. అదే సమయంలో ఒంటరిగా ఉంటే మీరు గెలిపిస్తే నాకు పొత్తే అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ గ్యారెంటీ మీరు ఇస్తారా అని ప్రజలను లేదా జనసైనికులను ప్రశ్నించారు. ప్రజల్లో ఉండి కొట్లాడి గెలవాలి కానీ, మీరు గ్యారెంటీ ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పడం ఏమిటని వైసీపీ నుండి బలంగా వస్తోన్న ప్రశ్న. ఏ నాయకుడైనా గ్యారెంటీగా గెలిపిస్తారా అని అడిగి రాజకీయాలు చేయడం చూడలేదని ఎద్దేవా చేస్తున్నారు. ఒంటరిగా గెలవలేక పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, అలాగే బాబుతో ప్యాకేజీ కోసం పొత్తు-గౌరవం అంటున్నారని విమర్శిస్తున్నారు.
పవన్ ఉద్దేశ్యం వేరే
తమ వైరిపక్షం నుండి తెలిసో, తెలియకో వచ్చే కొన్ని అంశాలను ఏ పార్టీ అయినా ఉపయోగించుకుంటుంది. అయితే ఇక్కడ వైసీపీ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. తాను వైయస్ పైన, జగన్ పైన ప్రజల కోసం ఉద్యమిస్తానని చెప్పాడు తప్ప, పంచె ఊడదీసి కొడతా అంటే అధికారంలోకి వస్తానని కాదు. అలాగే, పొత్తులపై విపక్షాలకు ఆయుధంగా ఉపయోగపడే ప్రకటన చేసినప్పటికీ, ప్రజల తరఫున పోరాడేందుకు ఇక్కడే ఉంటానని కుండబద్దలు కొట్టారు. తద్వారా రాజకీయాలు వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
చివరగా మరోమాట, నేను ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందనని చెబుతూ, టీడీపీతో పొత్తుకే సై అని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో గౌరవం ఉండాలన్నారు. కానీ ఇక్కడ పవన్ మరో ఘాటైన పదాన్ని ఉపయోగించారు. జగన్‌ను నియంత అన్నారు. ఆలోచిస్తే నియంతను ఎదుర్కోవడానికి ఎంతటి బలవంతుడైనా ఒక్కడు కష్టమే. అలాంటి వైసీపీ అధినేతను ఎదుర్కోవడానికి విపక్ష ఓటమి చీలకూడదనేది పవన్ ఉద్దేశ్యంగా చెప్పవచ్చు.