వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త రాగాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోడ్లు వేయలేకపోతున్నామని, రోడ్లపై పడిన గుంతలు కూడా పూడ్చలేకపోతున్నామని, తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులు ఇస్తుందని, అప్పటి నుండి నీళ్లు ఇస్తున్నట్లు చెప్పుకోవాల్సి వస్తోందని, కేంద్రం నిధులు ఇస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని ఇటీవలే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నిన్న మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గుంటూరు ప్రమాదానికి సంబంధించి మాట్లాడుతూ.. ఉయ్యూరు శ్రీనివాస్‌ను వెనుకేసుకు వచ్చారు. తాజాగా మేకతోటి సుచరిత పార్టీ మార్పు అంశంపై ఆసక్తికరంగా స్పందించారు.
రాజకీయంగా తాము వైసీపీతోనే ఉంటామని చెబుతూనే, నేను ఓ స్టేట్మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడి ఉంటారని, అలాకాకుండా దయాసాగర్ పార్టీ మారుతానంటే తాను ఓ భార్యగా ఆయన అడుగు జాడల్లో నడుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన భర్త ఓ పార్టీలో, నేను ఓ పార్టీలో, నా పిల్లలు మరో పార్టీలో ఉండరని, వైసీపీలో ఉండగలిగినన్ని రోజులు ఉంటామన్నారు. తాము ఈ పార్టీ కుటుంబ సభ్యులమేనని, ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అలాంటిది పార్టీలో సహజమే అన్నారు. విభేదాలు ఉన్నంత మాత్రాన ఎవరూ వేరు కాదన్నారు.
మేకతోటి సుచరిత గతంలో హోంమంత్రిగా పని చేశారు. రెండోసారి ఆమెకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. కేబినెట్లో చోటు దక్కక పోవడంతో ఆమె అప్పుడు అసంతృప్తికి గురయ్యారు. ఆమెను కేబినెట్లోకి తీసుకోవాలని సుచరిత వర్గీయులు ఆందోళన కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఆమెకు గుంటూరు వైసీపీ బాధ్యతలను అప్పగించారు. నవంబర్ నెలలో ఆమె ఈ పదవి నుండి కూడా తప్పుకున్నారు. తన నియజకవర్గం ప్రత్తిపాడుకు పరిమితమవనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.