అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వంగవీటి రంగా క్రెడిట్ కోసం పాకులాడుతున్నాయి. కాపు నేతగా పేరుగాంచిన ఆయన 1988 డిసెంబర్ 26న హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని చోట్ల వివాదం రాజుకుంది. వంగవీటి రంగా వర్ధంతిని నిర్వహించాలని గుడివాడ టీడీపీ నేతలు నిర్ణయించారు. అయితే దీనిని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చెప్పారు. దీంతో ఆదివారం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానిక టీడీపీ నేత రావి వెంకటేశ్వర రావుకు వైసీపీ నేతలు అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలా అడ్డుకుంటారో చూస్తామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. దీంతో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మాత్రం ఈ రోజు ఉదయం వర్ధంతి నిర్వహించేందుకు సిద్ధమైంది.
కొడాలి నాని అనుచరులు అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో పోలీసుల ఆంక్షల నడుమ రావి వెంకటేశ్వర రావు, టీడీపీ, జనసేన నాయకులు నివాళులు అర్పించారు. గుడివాడ ఏజీకే స్కూల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ ఇంచార్జ్ రావి పూలమాల వేశారు. పోలీసులు నిన్నటి నుండి ఇక్కడ 144 సెక్షన్ విధించారు. ఓ వైపు టీడీపీ వర్ధంతిని నిర్వహించేందుకు సిద్ధం కావడం, మరోవైపు వైసీపీ దీనిని అడ్డుకునే ప్రయత్నాల్లో ఉండటంతో, పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు మరోచోట రంగా వర్ధంతిని నిర్వహించారు.