TDP Mini Manifesto Is Trailer: Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao: టీడీపీ మినీ మేనిఫెస్టో ట్రైలరే అని.. ముందుంది అసలు సినిమా అని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) అన్నారు. మేనిఫెస్టో చూసి వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపిందని చెప్పారు. కొందరు వైసీపీ నేతలు తట్టుకోలేక మేనిఫెస్టో చించివేశారని తెలిపారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో జగన్ విధ్వంస పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో పాలనను ప్రారంభించారని గుర్తుచేశారు.
ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పిన జగన్ (jagan).. తర్వాత ఒక్కరికే ఇస్తున్నారని తెలిపారు. జగన్ పాలనలో ఏపీ అరాచకంలో ఆప్ఘనిస్తాన్, అప్పుల్లో శ్రీలంకను దాటిపోయిందని చెప్పారు. మద్యం నిషేధం విధిస్తామని చెప్పి.. మాట తప్పారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలను ఏడుసార్లు పెంచారని గుర్తుచేశారు. విద్యుత్ కోతలతో జనం ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) తెలిపారు. జగన్కు తల్లి, చెల్లి కూడా దూరం అయ్యారని గుర్తుచేశారు. ఈ విషయం ప్రజలు గమనించాలని గంటా శ్రీనివాస రావు అన్నారు. రాష్ట్రంలో నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనం ఇచ్చే తీర్పుతో వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందని పేర్కొన్నారు.
బీసీలకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కొడాలి నాని సహా వైసీపీ నేతలు స్పందించారు. మీ హయాంలో బీసీలకు ఇళ్లు కట్టించారా అని నాని అడిగారు. బీసీ నేతలకు పదవులు ఇచ్చారా..? ఏమీ ఇవ్వరు అని ధ్వజమెత్తారు. దానికి టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు కౌంటర్ ఇచ్చారు.