TDP Leaders: టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అంతా ఊహించారు. ప్రకటించిన వేదిక.. ఆ రోజు గురించే ఇప్పుడు చర్చ.. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు భయాందోళనకు గురవుతున్నారు. జనసేనతో కలిసి పోటీ చేస్తే అనే సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తెలుగు తమ్ముళ్ల అనుమానానికి కారణం ఏంటీ..? వారు ఎందుకంత భయపడుతున్నారో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీ చూడండి.
అమావాస్య రోజే ప్రకటన
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి జైలు స్నేహ బ్యారక్‌లో ఉన్నారు. ఈ నెల 14వ తేదీన పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తాం.. బీజేపీ కూడా కలిసి వస్తోందని తెలిపారు. పొత్తు ప్రకటనపై తెలుగుదేశం నేతలు భయపడుతున్నారు. ఎందుకంటే పొత్తు ప్రకటించింది జైలు బయట.. బాబును కలిసి.. జైలు బయట మాట్లాడుతూ మరీ చెప్పారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి.. అలాంటి కీలకమైన ఇష్యూని.. అక్కడ ప్రకటించడంతో కొంత బెంగ పెట్టుకున్నారు. దాంతోపాటు మరో కీలక అంశం ఉంది. అదే అమావాస్య కావడం.. పోయి పోయి.. అమావాస్య రోజే పవన్ కల్యాణ్ ప్రకటన చేయాలా..? అని వారు తలలు పట్టుకుంటున్నారు. మరో రోజు.. పార్టీ ఆఫీసు వేదిక చేస్తే బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు. అలా అయితే తమకు ఎలాంటి సందేహాం ఉండేది కాదని చెబుతున్నారు.
ముహూర్తం, సమయం, రోజు
ఎన్నికల్లో గెలవడాన్ని పార్టీ, నేతలు ప్రాధాన్యం ఇస్తారు. మంచి రోజు, సుముహూర్తం, సమయం చూసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి.. అధికారం చేపట్టాలని అనుకుంటున్నారు. పొత్తు గురించి చేసిన ప్రకటన సమయం మంచిది కాదని లోలోన మదన పడుతున్నారు. ఆ రోజు అనౌన్స్ చేయడంతో ఇరు పార్టీలకు మంచి జరుగుతుందా..? ఎన్నికల్లో ఆశించిన సీట్లలో గెలుస్తామా..? అనే ప్రశ్నలు వారి మెదళ్లను తొలచి వేస్తున్నాయి. కొందరు నేతలు మాత్రం లోలోన కుంగిపోతున్నారు. మరో రెండు రోజులు ఆగి ఉంటే బాగుండేది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైకమాడ్ పునరాలోచన చేయాలని మరీ మరీ కోరుతున్నారు.
జగన్ విసుర్లు
టీడీపీ-జనసేన పొత్తుపై తెలుగు తమ్ముళ్లు, నేతలు ఇలా భయపడుతుండగా.. సీఎం జగన్ విరుచుకుపడ్డారు. స్కిల్ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అన్నారు. దానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. చంద్రబాబు పీఏకు ఐటీ నోటీసులు ఇచ్చిందని సీఎం జగన్ తెలిపారు. ప్రజాధనం దోచుకున్న చంద్రబాబును కాక ఎవరినీ అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. అవినీతి కేసులో అరెస్టైన బాబును పవన్ ములాఖత్ అయి మిలాఖత్ అయ్యాడని ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తా అని ఆ విషయమే మరచిపోయాడని విరుచుకుపడ్డారు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? దోచిన వారిని జైలులో పెట్టకుంటే ఎక్కడ పెట్టాలని అడిగారు. అడగాల్సిన వ్యక్తే మిలాఖత్ అయ్యాడని సీఎం జగన్ విమర్శించారు.
మరోసారి ప్రకటన..?
ఇలా.. పొత్తుపై సొంత పార్టీ నేతల్లో సందేహాం నెలకొంది. జైలు బయట ప్రకటన పవన్ కల్యాణ్ చేయడం.. అమావాస్య రోజు కావడంతో కొందరు టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఈ కారణాలతో వచ్చే ఎన్నికల్లో తిరిగి తాము/ పార్టీ గెలవదనే భయం వారిని నీడలా వెంటాడుతోంది. ఇదే విషయం హైకమాండ్ పెద్దల దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. మరో మంచి వేదిక చూసుకొని.. సమయం చూసుకొని ప్రకటన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ నేతల వినతిని పెద్దల ఆలకిస్తారో లేదో చూడాలీ. అప్పటివరకు టీడీపీ నేతల మాత్రం టెన్షన్ మాములుగా ఉండటం లేదు.