సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా 15వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం వర్చువల్‌గా దీనిని ప్రారంభిస్తారు. తొలి బ్లూ అండ్ వైట్ కలర్ వందే భారత్ నవంబర్ 11, 2022న మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ప్రారంభమైంది. వీటి మధ్య దూరం 698 కిలో మీటర్లు కాగా, ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలు. మొదటి సెమీ హైస్పీడ్ వందేభారత్ మాత్రం ఢిల్లీ కాన్పూర్, అలహాబాద్,వారణాసి మార్గంలో ఫిబ్రవరి 15, 20019న ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీ-శ్రీవైష్ణో దేవీ మాతా కార్తా సహా పలు రైళ్లు వచ్చాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం సాగించనుంది. తొలుత 19న ప్రారంభించాలని భావించినప్పటికీ, తెలుగువారికి సంక్రాంతి కానుకగా నాలుగు రోజులు ముందు వస్తోంది.
సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడిచే ఈ రైలు ధరను IRCTC వెబ్ సైట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ రైలు చైర్ కార్ ఛార్జ్ రూ.1720, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే రూ.3170. ఇది సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం ఛార్జీ. విశాఖ నుండి బయలుదేరే వందే భారత్ ప్రతిరోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై, సికింద్రాబాద్‌కు 2 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుండి బయలుదేరే రైలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 గంటల 30 నిమిశాలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలు ఆగే స్టేషన్ల విషయానికి వస్తే వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రిలలో ఆగుతుంది.
15వ తేదీ ఆదివారం సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే వందే భారత్ మాత్రం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. రేపు ఒక్కరోజు మాత్రం చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారంపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. 16వ తేదీ నుండి కమర్షియల్ రన్ సమయంలో మాత్రం పై అన్ని స్టేషన్లలో ఆగదు. ఈ రైలు ఆదివారం మినహాయించి ఆరు రోజులు రన్ అవుతుంది. 14 ఏసీ చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. 1128 మంది ప్రయాణించవచ్చు. ఇందులో కేటరింగ్ సదుపాయం ఉంది. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లకు వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. ప్రయాణీకులు ఫుడ్ వద్దనుకుంటే కేటరింగ్ ఛార్జీలు వర్తించవు. అది ప్రయాణీకుడి ఇష్టం.