తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్నారు. స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
అలాగే రూ.300ల టికెట్ గల భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,242 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,862 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమల భక్తులకు టీటీడీ అధికారులు అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. భక్తులకు గదుల కేటాయింపు కూడా సవ్యంగానే సాగుతోంది. ఎటువంటి ఆటంకం లేకుండా తిరుమల శ్రీవారి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.