ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పండగ కోసం ఊరికి వెళ్లే ప్రయాణికుల జేబుకు చిల్లుపెడుతున్నాయి. టికెట్‌పై మూడు, నాలుగింతలు పెంచేసి ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నాయి. అయినా సరే.. పండుగ పూట సొంతూరికి వెళ్దాం అనుకుంటే.. సేఫ్టీ నిబంధనలు, ఫిట్ నెస్ లేని బస్సులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు. మామూలు రోజుల్లో అయితే ఒకరికి రూ.1000 ఉండే టికెట్ ధర పండుగ సీజన్లో రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా పెంచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు పట్టణాలకు, బెంగళూరు ఇతర నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ లెక్కలేనన్ని తిరుగుతున్నాయి. వాటిలో చాలావాటికి ఫిట్ నెస్ లేదు. మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ప్రయాణికులు వాపోతున్నారు.
విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, బెంగళూరు, తిరుపతి వెళ్లే బస్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. టికెట్ ధరలను పెంచడంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు ఫిట్ నెస్ లేని బస్సులు రోడ్డు మీదికి రాకుండా అడ్డుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై రవాణా శాఖ అధికారులు బుధవారం నుంచి ట్రావెల్స్ బస్సుల తనిఖీ చేశారు. సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను ఆపి, సరైన పత్రాలు, ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ లేని 6 బస్సులను సీజ్ చేశారు. టికెట్ ధరలను పెంచడంపై ఆరా తీస్తున్నామని అధికారులు చెప్పారు. డిమాండ్ ఉందని టికెట్ ధర పెంచి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.