జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. అంతేకాదు, ఆహా మొబైల్ అప్లికేషన్ కూడా ఎపిసోడ్ లైవ్ స్ట్రీమింగ్ అయిన వెంటనే ఐదు నిమిషాల్లోనే అత్యధిక యాప్ లాంచ్‌ను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ మొదటి పార్ట్ మాత్రమే స్ట్రీమింగ్ అయింది. రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 10న వస్తోంది.
పవన్ ఈ ఎపిసోడ్లో వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలపై స్పందించాడు. తనకు నటన అంటే ఆసక్తి లేదని, కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకొని ఆ రంగాన్ని ఎంచుకుందామని భావించానని, అలాగే రచయితనో.. దర్శకుడినో అవుదామని భావించానని చెప్పాడు. కానీ తన వదిన, అత్తయ్య ప్రోద్బలంతో సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పాడు. తనకు సిగ్గు ఎక్కువ అని, సుస్వాగతం సినిమాలోని ఓ పాటను బస్సుపై చిత్రీకరిస్తుంటే తనకు సిగ్గుగా అనిపించిందని, వదినకు ఫోన్ చేసి, ఇదే చివరి సినిమా అని చెప్పానని వెల్లడించారు. ఖుషీ తర్వాత కూడా వెళ్లిపోదామని భావించినట్లు చెప్పారు. రాజకీయాల్లో తన పక్కన ప్రోత్సహించేవారు ఎవరూ లేరన్నారు.