యువశక్తి సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్, మంత్రి రోజా, ముఖ్య నేతలను వదలకుండా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల మీద మంత్రులు రోజా, సిదిరి అప్పలరాజు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రోజాను డైమండ్ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ మీద ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కౌంటర్ అటాక్ చేశారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అని నిలదీశారు. ప్రజల కోసం తప్పడం లేదని కామెంట్ చేశారు. తమ ప్రభుత్వం జనం కోసం పనిచేస్తోందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని రోజా స్పష్టంచేశారు. పవన్ కల్యాణ్ మాత్రం వీకెండ్ పొలిటిషీయన్ అని విమర్శించారు. చుక్క తెగిపడినట్టు నిన్న సభ పెట్టారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి సిదిరి అప్పలరాజు విరుచుకుపడ్డారు. మీటింగ్ పెట్టాలని పవన్ కల్యాణ్‌కు సలహా ఇచ్చింది కూడా టీడీపీయేనని ఆరోపించారు. లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నాడు. ఆ ఐడియా కాపీ కొట్టి పవన్ యువశక్తి పేరుతో సభ పెట్టారని.. ఇందుకు లోకేశ్ కార్యక్రమమే స్ఫూర్తి అని గుర్తుచేశారు. మత్స్యకారుల వలసల గురించి పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసని మంత్రి అప్పలరాజు నిలదీశారు. ఫిషింగ్ హార్బర్లు నిర్మస్తుంటే కళ్లు కనిపించడం లేదా అని సూటిగా అడిగారు. తొమ్మిది హార్బర్లు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని మంత్రి అప్పలరాజు కొనియాడారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
నాయకుడంటే కార్యకర్తల్లో స్ఫూర్తి నింపాలి. ప్యాకేజీ కోసం మాట్లాడకూడదని మంత్రి అప్పలరాజు అన్నారు. పవన్ ప్యాకేజీ కోసం అమ్ముడుపోయాడు. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఒక ఖరీదైన పగటి వేషగాడు అని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేల కోట్లు తీసుకొని నాటకాలు ఆడుతున్నారు. జనసేన సభల పేర్లను కూడా టీడీపీ కన్ఫామ్ చేస్తోందని ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి పవన్ లాంటి గ్రామ సింహాలకు జగన్ భయపడరని అన్నారు మంత్రి అప్పలరాజు. దమ్ముంటే రాష్ట్ర అభివృద్దిపై చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సమస్యలపై దశాబ్దం పాటు పోరాడానని నిన్నటి సభలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బలం సరిపోతుందని అనుకుంటే ఒంటరిగా వెళ్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదని జన సందోహాన్ని ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. తన గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళ్తాం అని ఇండికేషన్స్ ఇచ్చారు. టీడీపీతో పొత్తు ఉంటుందని ఇండైరెక్టుగా చెప్పేశారు. అదే సమయంలో రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వని తేల్చి చెప్పారు. పవన్ విమర్శలు ఎక్కుపెట్టడంతో మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.