• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో క్రిప్టో క్రిమిన‌ల్‌

VSP: క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన భారీ కుంభకోణం విశాఖలో వెలుగుచూసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రవి కిరణ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితులు సీపీకి నేరుగా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

February 24, 2026 / 03:45 PM IST

చేనేత సమస్యలపై సీఎంకు వినతి పత్రం

సత్యసాయి: చేనేత కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేశ్ తీసుకెళ్లారు. సుమారు రూ.220 కోట్ల ఆప్కో బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.

February 24, 2026 / 03:45 PM IST

అమ్మవారిని దర్శించుకున్న ఛైర్మన్

VZM: చీపురుపల్లిలో జరుగతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.

February 24, 2026 / 03:39 PM IST

మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చొరవతో పేదలకు వైద్య సాయం

BPT: వైద్య ఖర్చుల వల్ల ఏ పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేత అనగాని శివప్రసాద్‌ అన్నారు. రేపల్లెలో మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చొరవతో మంజూరైన రూ.19,09,257 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఎల్‌ఓసీలను 29 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. సీఎం చంద్రబాబు సంకల్పంతో అర్హులందరికీ సకాలంలో వైద్య సాయం అందుతోందన్నారు.

February 24, 2026 / 03:35 PM IST

‘మెరుగైన ఉపాధి కోసం ప్రభుత్వ ఐటీఐలో చేరండి’

CTR: మెరుగైన ఉపాధి కోసం విజయపురం(మం) పన్నూరు సబ్‌స్టేషన్ నందు గల ప్రభుత్వ ఐటీఐ నందు చేరాలని ట్రైనింగ్ అధికారి మునికృష్ణయ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు కేరియర్ గైడెన్స్ అవగాహన నిర్వహించారు. రెండు సంవత్సరాలు, ఒక సంవత్సరం కోర్సుసు కలవని అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి మురళి పేర్కొన్నారు.

February 24, 2026 / 03:33 PM IST

పారిశ్రామిక, సాంకేతిక దిశగా అడుగులు..!

కడప: జిల్లా యువతకు నైపుణ్య వేదికగా నిలవనున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల వేగం, నాణ్యతపై సూచనలు ఇచ్చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించారు.

February 24, 2026 / 03:31 PM IST

కార్యకర్తలపై దాడిని ఖండించిన మక్బూల్

సత్యసాయి: కదిరి మండలం యాకలచెరువుపల్లిలో YCP కార్యకర్తలపై జరిగిన దాడిని నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మక్బూల్ డిమాండ్ చేశారు.

February 24, 2026 / 03:31 PM IST

ప్రభుత్వ అసమర్థత వల్లే డయేరియా విజృంభణ

SKLM: జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి 18 మంది ప్రజలు ఆసుపత్రి పాలు కావడానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మతు పనులతో తాగునీరు కలుషితమవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

February 24, 2026 / 03:30 PM IST

కల్తీ పాలు ఘటనపై స్పెషలిస్ట్ రవిరాజు ఆరా.!

E.G: రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. సరైన ప్రోటోకాల్‌తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.

February 24, 2026 / 03:30 PM IST

పింఛన్‌పై విస్తుపోయే వాస్తవాలను వెల్లడించిన సోమిరెడ్డి

NLR: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఏపీలో అమలవుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.1400 కోట్లు ఖర్చు పెడితే, మన ప్రభుత్వం రూ.2750 కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అర్హులందరికీ పించన్ అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 03:30 PM IST

తాగునీటి సమస్య.. ఇబ్బంది పడుతున్న ప్రజలు..!

NDL: కొలిమిగుండ్ల పట్టణంలో ఇవాళ తాగునీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా బీసీ కాలనీ, శాంతినగర్, నాయి బ్రాహ్మణ కాలనీలలో పైపులు లీకేజీ కావడంతో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామ సర్పంచ్ శివ రాముడు వెంటనే లీకేజీ ఉన్న ప్రదేశంలో పైపులను మరమ్మతులు చేస్తున్నారు. వేసవికాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

February 24, 2026 / 03:27 PM IST

ఎంవీ కృష్ణారావుకు రేషన్ డీలర్లు నివాళ్ళు

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవనిగడ్డ వంతెన సెంటరులో ఆయన విగ్రహానికి మంగళవారం మండల రేషన్ డీలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

February 24, 2026 / 03:27 PM IST

జిల్లాలో 98 శాతం ఇంటర్ పరీక్షలు..!

ఏలూరు: జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

February 24, 2026 / 03:23 PM IST

ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు పదోన్నతులు

ఏలూరు: జిల్లా ఐటీడీఏ కేఆర్ పురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 తెలుగు పండిట్స్, సుమారు 53 మంది ఉపాధ్యాయులకు ఎస్ఏ తెలుగు పండిట్స్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు వారికి పదోన్నతి ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. ఉపాధ్యాయులు తమ సేవలను గుర్తించినందుకు పీవోకు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 03:21 PM IST

రెండవ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

ATP: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. కనీస పనికి కనీస వేతనం అమలు చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 03:20 PM IST