విశాఖపట్నంలో ప్రతి సోమవారం కలెక్టరేట్, జీవీఎంసీ మెయిన్ కార్యాలయం, జోన్ కార్యాలయాల్లో PGRS నిర్వహిస్తున్నారు. అయినా ఫిర్యాదులు ఎక్కువగా జోన్ కార్యాలయాలకంటే జీవీఎంసీ మెయిన్ ఆఫీస్, కలెక్టరేట్‌కే చేరుతున్నాయి. జోనల్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదా? లేక వాటి వివరాలు ప్రజలకు తెలియవా? అనే అంశంపై చర్చ జరుగుతుంది.
VZM: విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు చొరవతో ఆదివారం మండలం పరిధిలో గల 7 రహదారుల నిర్మాణం (15.068 కి.మీ.) కొరకు రూ.7.67 కోట్లు నిధులు మంజూరు అయినట్లు మండల పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలో ప్రజల తరపున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
కడప: జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా చికెన్ ధరలు పెరిగాయి. గత వారం రూ. 220గా ఉన్న కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ. 250కు చేరింది. స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్ అధికమవడంతో దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపిస్తోంది. రంజాన్ కాలంలో వినియోగం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.
ప్రకాశం: కంభంలో SI శివకృష్ణారెడ్డి శనివారం రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
KRNL: ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే వెబ్‌సైట్లను సృష్టించి, భారీ డిస్కౌంట్ల పేరుతో ముందస్తు చెల్లింపులు తీసుకుని వస్తువులు పంపకుండా కేటుగాళ్లు మోసం చేస్తున్నారన్నారు.
శ్రీకాకుళం: నరసన్నపేటలోని కలివరపుపేటలో రేషన్ డిపోను రాష్ట్ర కూరాకుల, పొందర కార్పొరేషన్ అధ్యక్షులు దామోదర నరసింహులు ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రేషన్ డిపో డీలర్‌గా పనిచేసిన చక్రవర్తి రెండు నెలల క్రిందట మృతి చెందడంతో ఖాళీ ఏర్పడిందన్నారు. దీంతో లక్కోజు స్వప్నకు రేషన్ డిపో అప్పగించింది.
SKLM: శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పిలి వీధి, చిన్న బజార్, మేధర వీధి తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ విస్తృతంగా ఆదివారం పర్యటించారు. వార్డుల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోడ్ల శుభ్రత, చెత్త సేకరణ, కాలువల శుభ్రపరిచే పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ATP: వజ్రకరూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9052548047, 8008949107 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ATP: జిల్లాలో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. ఆదివారం ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం: టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన అన్నెపు ప్రకాశరావు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీ జి. యశోదకృష్ణ హాస్పిటల్‌కు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు.
NDL: బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో ఆదివారం ఎస్సై జగన్మోహన్ పోలీస్ సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో అనుమానిత బెల్ట్ షాపు నడిపేవారి ఇళ్ళు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 6 మోటార్ సైకిళ్లను, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ప్రజలతో సమావేశం నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించారు.
KDP: లింగాల మండలంలో బియాండ్ ఎత్తిపోతల పథక ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారి చింతల, లోపట్నూతల గ్రామాల ప్రజలు రైతులు తాగు, సాగునీరు అందక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలన్నారు.
NLR: గుడ్లూరులో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతున్నదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. చెరువుల్లో తవ్వకాలు జరిపి గ్రావెల్‌ను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొత్తపేట చెరువులో శనివారం రాత్రి నుండి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు.
సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.