PPM: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కలిశారు. బలిజిపేట మండలం ఆజ్జాడ, పార్వతీపురం మండలం MR నగరంలో సబ్ స్టేషన్లను మంజూరు చేయాలని వినతి ఇచ్చారు. అనంతరం స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ను కలిసి పార్వతీపురం మార్కెట్ యార్డ్‌లోని భవనాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
VZM: బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ నియమితులయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌తో పాటు అదనంగా బుడా వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు, మూడు రోజుల్లో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
GNTR: తెనాలి పోలీసులు శుక్రవారం లాడ్జిల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి కాపాడారు. చిట్ ఫండ్ కంపెనీ చెల్లింపులు నిలిపివేయడంతో ఖాతాదారుల ఒత్తిడిని తట్టుకోలేకపోయిన ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి తెనాలికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు రావడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు.
W.G: ఈ ఏడాది డిసెంబరు 31లోపు ESIలో రిజిస్టర్ కాని కార్మికుల వివరాలు తణుకు బ్రాంచ్ కార్యాలయంలో నమోదు చేయించాలని ESI బ్రాంచ్ మేనేజర్ ఆనంద్ పాల్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన SPREE పథకం ద్వారా 10 మంది కంటే కార్మికులు ఎక్కువగా ఉండి, వారి నెల వేతనం రూ. 21వేల కంటే తక్కువ ఉంటే వారిని ESI పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.
CTR: పులిగుంటీశ్వర ప్రకృతి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఎండీ పసపల హరికృష్ణారెడ్డికి న్యూఢిల్లీలో అక్టోబర్ 30, 31న జరిగే అంతర్జాతీయ ఆర్గానిక్ మేళాకు ఆహ్వానం లభించింది. ఆయన ప్రకృతి పంటలను ప్రదర్శిస్తూ, రైతుల సమస్యలు, అవకాశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈయన 2022 లో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ATP: తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం తొలి శనివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనమిచ్చారు. ఉదయాన్నే అర్చకులు వివిధ అభిషేకాలు నిర్వహించి స్వామిని అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించగా వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు.
CTR: కొబ్బరికాయలు కోయడానికి చెట్టు ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శుక్రవారం రామకుప్పం మండలంలో జరిగింది. సింగసముద్రం పంచాయతీ చింతమానత్తం గ్రామానికి చెందిన శంకరప్ప(50) బంధువుల కోసం తమ పొలంలోని కొబ్బరిచెట్టు ఎక్కాడు. ఈక్రమంలో శంకరప్ప ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
NLR: కర్నూలులో నిన్న జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
NLR: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించే అర్హత వైసీపీ అధినేత జగన్‌కు లేదని NUDA ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి ఆద్యులు జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. జగన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తు పరిణామాలను ఊహించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ కుటుంబం ఎందరికో ఆదర్శని వెల్లడించారు.
NTR: పదేహేనేళ్లకే కొడుకు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ తల్లి తల్లడిల్లింది. విగతజీవిగా పడి చూసి ఆమె రోదించిన తీరు వర్ణనాతీతం. జగ్గయ్యపేటలో గోలి వెంకట గణేష్ నిన్న పాఠశాలకు వెళుతూ గుండెపోటుతో మరణించాడు. బాలుడి తండ్రి రామారావు 2ఏళ్ల క్రితం గుండెపోటుతోనే చనిపోయాడు. మరో అయిదేళ్లలో కొడుకు చేతికొస్తాడకున్న ఆతల్లి ఆశల్ని నిరాశలు చేస్తూ గణేశ్ వెళ్లిపోవడం కలిచివేసింది.
AKP: ఎలమంచిలిలో జరుగుతున్న పంచరాత్రుల మహోత్సవాల్లో భాగంగా శనివారం భూలోకమాంబ తీర్థ మహోత్సవం జరగనుంది. స్థానిక తులసి నగర్ ప్రాంతంలో జరగనున్న తీర్థ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. దీంతో నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. తీర్థ మహోత్సవాల్లో భాగంగా భూలోకమాంబ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ATP: మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతపురంలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం ఆయన జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కాఫీ చిట్ చాట్ నిర్వహించారు. కాఫీ తాగుతూ జిల్లా రాజకీయాలు, పార్టీ బలోపేతం, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పాలనపై వారి అభిప్రయాలను తెలుసుకున్నారు.
VZM: గజపతినగరంలోని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గీతా మందిరంలో శుక్రవారం రాత్రి హనుమత్ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సత్య సాయి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ కళ్యాణం జరిగింది. అంతకుముందు గ్రామంలోని ప్రధాని వీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ కార్యక్రమం కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో నిర్వహించారు.
ప్రకాశం: జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడితే తప్పక విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఇ వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా కంట్రోల్ రూమ్ నంబర్ 9440817491కు కాల్ చేయాలని తెలిపారు.
NDL: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఛైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కృష్ణమ్మ హారతి కోటి దీపోత్సవం నిర్వహించారు.