ELR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. మహిళల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మహిళల రక్షణకు ఉద్దేశించిన శక్తీ యాప్ వంటి వాటిపై మహిళలకు అవగాహన కలిగించాలన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని సత్యసాయి పాలియేటివ్ కేర్, క్యాన్సర్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాన్సర్ చివరి దశలో ఉన్న వారికి ఈ కేంద్రం అందిస్తున్న ఉచిత సేవలు అభినందనీయమని కొనియాడారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి నిర్వాహకులు ఉన్నారు.
VZM: రాజాంలోని జీఎంఆర్ గృహ సముదాయంలో ఫిబ్రవరి 1న జరిగిన జంట చోరీల మిస్టరీ వీడింది. ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి నుంచి రూ.32 లక్షల విలువైన 470 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
CTR: సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ కళాశాల ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 12 వరకు పొడగించినట్లు ప్రిన్సిపల్ జయసింహనాయుడు తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పలు వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు.
చిత్తూరు జిల్లా సాయుధ దళం కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. వేసవి వేడి నేపథ్యంలో ప్రజలకు శుద్ధి చేసిన చల్లని త్రాగునీరు అందించేందుకు ఏఆర్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గోన్నారు.
ASR: డుంబ్రిగూడ మండలం కింజేరు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం, పీపుల్స్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 140 మంది రోగులు వైద్య సేవలు పొందారు. డా ఎం.ఐ. విజయ్ భాస్కర్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
WG: పాలకొల్లులో గురువారం జనసేన 5వ దశ ఉద్యమి సభ్యత్వ నమోదుపై కార్యాచరణ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని పాలకొల్లు, ఆచంట నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కర్నూలు: వంద శాతం చెత్త సేకరణను సమర్థంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇవాళ కోరారు. శానిటేషన్ ఇన్స్‌స్పెక్టర్, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటింటి చెత్త సేకరణ, చెత్త వాహనాల జీపీఎస్ ట్రాకింగ్‌పై సమీక్షించారు. నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయనిన్నారు.
KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను మాజీ సీఎం జగన్ ఆశీర్వదించారు. గురువారం రిసెప్షన్ వేడుకలకు హాజరైన జగన్ పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తల నడుమ రిసెప్షన్ హాలుకు చేరుకొని వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఆయనకు పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.
BPT: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను గురువారం చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రహదారులు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల మంజూరుపై ఈ సందర్భంగా వారు చర్చించారు. చీరాల పర్యటనకు రావాలని ఎమ్మెల్యే కోరగా, పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.
NDL: బండి ఆత్మకూరు మండలంలో 2024-25లో చేపట్టిన ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరిగింది. ఎంపీడీవో గాయత్రి ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు, తనిఖీ బృందం పాల్గొన్నారు. మండలంలో రూ.10.15 కోట్ల పనులు చేశారని చెప్పారు. రికవరీ రూపంలో రూ.13,262, పెనాల్టీ రూపంలో రూ.21వేల రికవరీకి ఆదేశించారు.
ELR: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజనులకు చెందిన ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
VSP: జీవీఎంసీ 48వ వార్డు కొండ ప్రాంతపు సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ గంకల కవిత జీవీఎంసీ కమిషనర్‌ను కోరారు. గురువారం జీవీఎంసీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి అందజేశారు. కొండ ప్రాంతంలో జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్లో 72A/2, 75A/5, 75A/6 స్తంభాలు, ఇండ్లకు అతి దగ్గరలో ఉన్నాయని, వాటి తీగలు తగిలి గతంలో కొందరు మరణించారని, ఆ స్తంభాలను తొలగించాలన్నారు.
SKLM: పలాస మున్సిపాలిటీలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే నెంబర్ 28లో ఉన్న సుమారు 1.84 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారని 29వ వార్డు కౌన్సిలర్ జోగ మల్లేశ్వరరావు ఆరోపించారు. సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ తహసీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు.