E.G: కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల వల్ల బీజేపీకి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాత్రి రాజమండ్రిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
E.G: బ్రిడ్జిపేట 14వ వార్డులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ బుధవారం కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమణి రమేశ్ బాబు, రాష్ట్ర రైతు విభాగ నాయకుడు పరిమి సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
ATP: కూడేరు ఎస్సీ, ఎస్టీ రైతులు అరటి పంటసాగుకు 30 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందించనుందని హార్టికల్చర్ ఆఫీసర్ యామిని, ఎంపీఈవో జాస్మిన్ బుధవారం తెలిపారు. ఈ మేరకు రెండున్నర ఎకరాలో 4 వేల అరటి మొక్కలను సాగు చేసుకోవాలన్నారు. అనంతరం సాగైన రెండు నెలలకు హార్టికల్చర్ ఆఫీస్ లేదా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తొలి ఏడాది అరటి పెంపకానికి రూ.42 వేలు ఇస్తామన్నారు.
ELR: జిల్లాలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించిన కమిటీ సమావేశంలో జిల్లాలోని 175 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునఃనిర్మాణానికి రూ.160.25 కోట్లకు ప్రతిపాదనలు ఆమోదించారు. 100 సాగు, తాగునీటి చెరువుల ఫిల్లింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. భూగర్భ జలాల పెంపు, నాణ్యతతో పనులు పూర్తి చేసేలా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
GNTR: ఆర్టీసీ బస్టాండ్‌లో ఫిట్స్ వచ్చి పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు పాతగుంటూరు పోలీసులు తెలిపారు. ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటల సమయంలో 50ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ఫిట్స్‌తో పడిపోయినట్లు ఆర్టీసీ కంట్రోలర్ 108కి సమాచారం ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా 8వ తేదీన మరణించాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
E.G: జగన్‌తోనే క్రైస్తవుల అభివృద్ధి సాధ్యమని, మళ్లీ ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వం వస్తుందని వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రెవ.విజయ బుధవారం తెలిపారు. వైసీపీతోనే పాస్టర్లకు రూ.5,000 గౌరవ వేతనం కొనసాగించాలని కోరుతూ కొంతమూరులో పాస్టర్లు కె.ఏలియా, బి.ఎలీషా ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని విజయ సారథి హామీ ఇచ్చారు.
W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో పట్టణ ప్రజలు ఇల్లు, మంచినీటి కుళాయి, ఖాళీ స్థలాల పన్నులు వెంటనే చెల్లించాలని కమిషనర్ సీ.హెచ్ కృష్ణమోహన్ బుధవారం కోరారు. ఈనెల 30 నాటికి చెల్లించాల్సిన అర్ధ సంవత్సర పన్నులు బకాయిలతో సహా చెల్లించాలన్నారు. చెల్లించని బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
W.G: నరసాపురం హౌసింగ్ EEగా రమణమూర్తి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన భీమవరం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన రమణ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి బదిలీపై వెళ్లారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు సబ్ డివిజన్‌లోని డీఈ, ఏఈలు ఇతర సిబ్బంది బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
W.G: ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బుధవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హ్యకథాన్ -25 సెమీఫైనల్స్‌లో విన్నర్స్, రన్నర్స్‌కు కలెక్టర్ నాగరాణి బహుమతులు అందించారు. విన్నర్స్‌గా భీమవరం, రాజమండ్రి, సూరంపాలెం, కాకినాడ కళాశాలలు దక్కించుకున్నాయి. రన్నర్స్‌గా తుని, రాజమండ్రి, భీమవరం, సూరంపాలెం, కైట్ ఇంజినీరింగ్ కాలేజీ రాజమండ్రి కళాశాల నిలిచాయి.
W.G: జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో బుధవారం సమీక్షించారు. కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్, వాట్సాప్ గవర్నెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇవాళ్టి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో సముద్రం పోటు వలన ముంపుకు గురవుతున్న ప్రాంతల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారు. 11.30 గంటలకు సఖినేటిపల్లి పంచాయతీ వద్ద లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
ELR: జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 78,145 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశామన్నారు. 1,873 మెట్రిక్ టన్నుల యూరియా, 26 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు.
KKD: నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజల రక్షణకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఒక అత్యవసర కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయించి అక్కడి నుంచి సానా సతీష్ బాబు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కంట్రోల్ సెల్ సమాచారం ప్రకారం, మొత్తం 217 మంది ఆంధ్రులు నేపాల్లో ఉన్నారు.
KRNL: ఎస్సీ కార్పొరేషన్ ఉచిత హెవీ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బుధవారం కర్నూలులోని కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేయగా, అందులో 18 మంది హాజరయ్యారని చెప్పారు. అర్హులైన పది మందిని ఎంపిక చేయగా వారిలో ఒక మహిళ ఉన్నట్లు ప్రకటించారు.
ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో సత్య సాయి శత జయంతి ఉత్సవాలకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం (ఎన్ఎస్పీ ఎన్) రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా నిలపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.మరికొన్ని రైళ్లను ఆ స్టేషన్ మీదుగా మళ్లిస్తామని రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నవంబరు నెలలో వీటిని ఎస్ఎన్ఎన్‌లో రెండు నిమిషాలు ఆపుతామని తెలిపారు.